ప్రజలకు సమర్థవంతమైన, పారదర్శకమైన పోలీసింగ్ సేవలను అందించడమే ప్రధాన లక్ష్యం..

🔴 ప్రజలకు మరింత సమర్థవంతమైన, పారదర్శకమైన పోలీసింగ్ సేవలను అందించడమే ప్రధాన లక్ష్యం..

నిజ స్వరూపం తాండూరు ప్రతినిధి ::

వికారాబాద్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీమతి స్నేహ మెహ్రా బుధవారం తాండూర్ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీలలో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ స్నేహ మేహర పోలీస్ స్టేషన్ ఆవరణ పరిశుభ్రత, కార్యాలయ నిర్వహణ, రికార్డుల భద్రత మరియు సిబ్బంది విధి నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. ముఖ్యంగా స్టేషన్ డైరీలు, పెండింగ్ కేసుల పురోగతి, రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు, హిస్టరీ షీట్లు, ఆర్డర్ బుక్, బీట్ బుక్స్, వారెంట్ల అమలు స్థితిగతులతో పాటు స్వాధీనం చేసుకున్న ఆస్తుల రికార్డులు , కేసు ప్రాపర్టీల భద్రత వంటి పలు కీలక అంశాలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు.

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు మరియు పోలీసులకు-ప్రజలకు మధ్య ఎలాంటి అంతరాలు లేకుండా నిరంతరం అందుబాటులో ఉండే విధంగా అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించాలని ఆదేశించారు. స్టేషన్‌లో ఎలాంటి రికార్డులను పెండింగ్‌లో పెట్టకూడదని, ప్రతి రికార్డును ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లల రక్షణ మరియు వారిపై జరిగే నేరాల కేసుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉంటూ, ప్రత్యేక నిఘా ఉంచాలని, బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా చట్టపరమైన చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. శాస్త్ర సాంకేతికతను జోడించి రాత్రి వేళల్లో గస్తీ నిరంతరం కొనసాగించాలని, పాత నేరస్థుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని పేర్కొన్నారు.

రాబోయే ప్రతిష్టాత్మక బోనాలు మరియు మొహర్రం పండుగలను పురస్కరించుకుని జిల్లా ఎస్పీ గారు శాంతిభద్రతల పరిరక్షణపై అధికారులకు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. పట్టణంలోని సమస్యాత్మక, ముఖ్యమైన ప్రాంతాలలో సీసీటీవీ కెమెరాల నిఘాను మరింత బలోపేతం చేయాలని, జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు వచ్చే విధంగా పనిచేయాలని సిబ్బందికి తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో తాండూర్ ఇన్స్పెక్టర్ పరమేశ్వర్ , ఎస్‌ఐ లు,ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.