వికారాబాద్ జిల్లా | తాండూర్
రూ.5.5 కోట్లతో ప్రతిపాదనలు.. తాండూరు ప్రభుత్వ ఆస్పత్రిలో త్వరలో ఐసీయూ
మారనున్న తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి రూపురేఖలు
రూ.2 కోట్లతో అత్యాధునిక పరికరాల ఏర్పాటు – 15 రోజుల్లో పనులు పూర్తి చేయడానికి అధికారుల కసరత్తు
డీఎంహెచ్‌వో బృందం పరిశీలన – ఇక తాండూరులోనే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు
తాండూరు, కొడంగల్ నియోజకవర్గాల ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు మరింత విస్తృతంగా అందనున్నాయి. తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఐసీయూ (ఇంటెన్సివ్ కేర్ యూనిట్) ఏర్పాటు కోసం ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. అధికారులు 15 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
తాండూరు ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి, మెడికల్ ఎడ్యుకేషన్ శాఖ అధికారుల సమన్వయంతో ఐసీయూ ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 200 పడకల సామర్థ్యం కలిగిన ఈ ఆస్పత్రిలో కొడంగల్ మెడికల్ కాలేజీ తాత్కాలికంగా కొనసాగుతుండటంతో ఐసీయూ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.
ఆస్పత్రిలో వివిధ విభాగాలకు రూ.2 కోట్లతో అత్యాధునిక వైద్య పరికరాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం అత్యవసర పరిస్థితుల్లో రోగులను హైదరాబాద్‌కు రిఫర్ చేయాల్సి వస్తుండగా, ఐసీయూ అందుబాటులోకి వచ్చిన తర్వాత క్రిటికల్ కేర్ సేవలు తాండూరులోనే అందనున్నాయి. దీంతో రిఫరల్స్ గణనీయంగా తగ్గనున్నాయి.
అలాగే ఆస్పత్రిలో నాలుగు ఫ్రీజర్లతో కూడిన ఆధునిక మార్చురీని ఏర్పాటు చేసి, మెడికల్ విద్యార్థుల బోధనకు అనువుగా ఆధునికీకరించనున్నారు.
హెచ్‌డీఎఫ్‌సీ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ సహకారం
తాండూరు మెడికల్ కాలేజీలో ఐసీయూ ఏర్పాటుకు అవసరమైన నిధుల సమీకరణలో భాగంగా ప్రిన్సిపల్ డా. రాజు, వైస్ ప్రిన్సిపల్ డా. పద్మ కృషి చేశారు. ఈ నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సీఎస్‌ఆర్ ఫండ్ ద్వారా రూ.10 లక్షల ఆర్థిక సహకారం అందించింది.
ఈ సదుపాయాలు తాండూరు, కొడంగల్, పరిగి, వికారాబాద్ జిల్లా, సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ ప్రాంతాలతో పాటు కర్ణాటక రాష్ట్రంలోని చించోళి, గుర్మిట్కల్, సేడం తదితర ప్రాంతాల ప్రజలకు కూడా ఎంతో ఉపయోగపడనున్నాయి.
డీఎంహెచ్‌వో బృందం పరిశీలన
వికారాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా. సుధాకర్, ఉప వైద్యాధికారి డా. రవీందర్ ఆధ్వర్యంలోని వైద్య బృందం బుధవారం ఆస్పత్రిని సందర్శించి, ఐసీయూ ఏర్పాటుకు ఎస్‌ఎన్‌సీయూ హాల్‌ను పరిశీలించింది. హాల్‌ను ఖాళీ చేసి డీఎంఈ సిబ్బందికి అప్పగించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు సూచించింది.
ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ…
“తాండూరు జిల్లా కేంద్ర ఆస్పత్రి ఆధునికీకరణ కోసం రూ.5.5 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ఈ నిధులతో ఆస్పత్రిలో కొత్త వైద్య పరికరాలు, మైనర్ మరమ్మతులు, పెయింటింగ్ తదితర పనులు చేపడతాం. ఐసీయూ ఏర్పాటుతో రోగులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను స్థానికంగానే అందించేలా చర్యలు తీసుకుంటున్నాం” అని ఎమ్మెల్యే తెలిపారు.
