సాయిపూర్ 10వ వార్డులో నీటి మయం.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు

సాయిపూర్ 10వ వార్డులో నీటి మయం.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు

వికారాబాద్ జిల్లా | తాండూర్

ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏమైంది..?
సాయిపూర్ 10వ వార్డు కాలనీవాసుల ఆగ్రహం..!
మోకాళ్ల లోతు వరకు నిలిచిపోయిన వర్షపు నీరు.
రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న కాలనీవాసులు.
ఎన్నికల హామీలు నెరవేర్చలేదని ప్రజల ఆవేదన.
కౌన్సిలర్, మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం.
వెంటనే సమస్యను పరిష్కరించాలని కాలనీవాసుల డిమాండ్.
ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తాండూర్ మున్సిపాలిటీ పరిధిలోని సాయిపూర్ 10వ వార్డులో కొద్దిపాటి వర్షానికే రోడ్డుపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రోడ్డు పక్కనే ఉన్న డ్రైనేజీ సక్రమంగా లేకపోవడంతో డ్రైనేజీ నీటితో పాటు వర్షపు నీరు కూడా రోడ్డుపైనే నిలిచిపోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోకాళ్ల లోతు వరకు నీరు నిలవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని తెలిపారు.

నిల్వ నీటిలో దోమలు, క్రిమికీటకాలు పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, సంబంధిత వార్డు కౌన్సిలర్ స్పందించి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీవాసులు కోరుతున్నారు.