వికారాబాద్ జిల్లా
తాండూరులో దొంగల బీభత్సం
తాండూరు పట్టణంలో దొంగలు మరోసారి హల్చల్ చేశారు. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు అర్ధరాత్రి ఓ ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు.
ఇంటి యజమాని తన సెల్ఫోన్లో సీసీ కెమెరాల దృశ్యాలను గమనించడంతో చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన ఇద్దరు దొంగల దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
చోరీకి గురైన నగదు, బంగారం, ఇతర వస్తువుల వివరాలు, మొత్తం విలువ ఎంత అనేది తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా, ఈ నెల 4న తాండూరు పట్టణంలో వరుసగా నాలుగు చోరీలు జరగగా, పది రోజులకే మరోసారి దొంగలు హల్చల్ చేయడం కలకలం రేపుతోంది. పట్టణంలో తరచూ చోరీలు జరుగుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దొంగతనాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు నిఘా పెంచి, సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను త్వరగా పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
