🔴 తాండూర్ రైల్వే క్వార్టర్స్ వద్ద యువకుడి మృతదేహం.. కలకలం
నిజస్వరం తాండూర్ ప్రతినిధి ::
వికారాబాద్ జిల్లా తాండూర్ రైల్వే క్వార్టర్స్ సమీపంలో ఓ యువకుడి మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. ఈ ఘటన శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది.
ప్రాథమిక సమాచారం మేరకు.. పట్టణంలోని మాణిక్ నగర్ ప్రాంతానికి చెందిన మున్వర్ ఆటో నడుపుతూ వాటర్ బాటిళ్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే శుక్రవారం ఉదయం రైల్వే క్వార్టర్స్ సమీపంలో మృతిచెందిన స్థితిలో కనిపించాడు.
యువకుడి కడుపు వద్ద కత్తిపోట్లు కనిపించడంతో ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించినట్లు సమాచారం.
విచారణలో భాగంగా మున్వర్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి మద్యం సేవించినట్లు పోలీసులకు సమాచారం లభించినట్లు తెలుస్తోంది. దీంతో యువకుడి మృతిపై అతని ఇద్దరు స్నేహితులపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తూ, వారి కోసం గాలింపు చేపట్టినట్లు సమాచారం.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తాండూర్ సీఐ పరమేశ్వర్ తెలిపారు.
