తాండూర్ ఆర్టీసీ డిపోలో వాహనాల విడిభాగాల మాయం! ఆర్టీఏ సీజ్ చేసిన వాహనాలకూ భద్రత కరువు.. యజమానులకు తీరని నష్టం!

తాండూర్ ఆర్టీసీ డిపోలో వాహనాల విడిభాగాల మాయం!

ఆర్టీఏ సీజ్ చేసిన వాహనాలకూ భద్రత కరువు.. యజమానులకు తీరని నష్టం!

వికారాబాద్ జిల్లా తాండూర్‌లో ఆర్టీఏ అధికారులు సీజ్ చేసి ఆర్టీసీ బస్ డిపో పార్కింగ్‌లో ఉంచిన వాహనాల్లో బ్యాటరీలు, స్టెప్నీ టైర్లు, ఇతర విడిభాగాలు చోరీకి గురవుతున్నాయంటూ వాహన యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వ్యాపారాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ వాహనాల ట్యాక్స్ చెల్లించలేకపోవడంతో ఆర్టీఏ అధికారులు వాటిని సీజ్ చేసి డిపోలో నిలిపివేశారు. ఇప్పటికే వాహనాలను విడిపించుకునేందుకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న యజమానులకు, ఇప్పుడు విడిభాగాలు మాయమవుతుండటంతో మరింత భారం పడుతోందని వాపోతున్నారు.

**ట్యాక్స్ కట్టలేక వాహనాలు కోల్పోయే పరిస్థితి.. కాపాడుకోవాల్సిన వాహనాల్లోని విడిభాగాలే మాయమవుతుంటే తమ పరిస్థితి ఏమిటని యజమానులు ప్రశ్నిస్తున్నారు.** అప్పులు చేసి వాహనాలు కొనుగోలు చేశామని, చోరీలతో మరింత అప్పుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సీజ్ చేసిన వాహనాల భద్రతకు బాధ్యత ఎవరిది? పార్కింగ్‌లో వాహనాల విడిభాగాలు మాయమవుతున్నాయన్న ఆరోపణలపై సంబంధిత అధికారులు స్పందించి విచారణ చేపట్టి, బాధ్యులను గుర్తించి తమకు న్యాయం చేయాలని వాహన యజమానులు కోరుతున్నారు.