తాండూరులో సీజనల్ ఫ్లూపై అవగాహన ఫ్లూ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

వికారాబాద్ జిల్లా | తాండూర్

తాండూర్ పట్టణంలో సీజనల్ ఫ్లూ, వైరల్ జ్వరాలు, శ్వాసకోశ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు యశోద హాస్పిటల్ ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ వై. సాయి రెడ్డి.

హంస గ్రాండ్ హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వాతావరణ మార్పుల నేపథ్యంలో సీజనల్ ఫ్లూ, వైరల్ జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇన్‌ఫ్లుయెంజా వైరస్ వల్ల వచ్చే సీజనల్ ఫ్లూ.. దగ్గు, తుమ్ములు, శ్వాసకోశ స్రావాల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉందన్నారు. జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ముక్కు కారడం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, నీరసం వంటి లక్షణాలు కనిపించవచ్చని తెలిపారు.

చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, మధుమేహం, గుండె లేదా ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

చేతులను తరచుగా శుభ్రంగా కడుక్కోవడం, దగ్గు లేదా తుమ్ము సమయంలో మాస్క్ లేదా టిష్యూ ఉపయోగించడం, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇతరులకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు పాటించాలని చెప్పారు.

జ్వరం, దగ్గు తీవ్రత పెరిగినా.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. వైద్యుల సలహా లేకుండా యాంటీబయాటిక్స్ లేదా ఇతర మందులను స్వయంగా తీసుకోవద్దని స్పష్టం చేశారు.

ఫ్లూ నుంచి రక్షణ పొందేందుకు ఫ్లూ వ్యాక్సిన్ కూడా ముఖ్యమైన నివారణ మార్గమని డాక్టర్ సాయి రెడ్డి తెలిపారు.

ఈ సమావేశంలో మార్కెటింగ్ విభాగానికి చెందిన సుదర్శన్ రెడ్డి, రవితేజ పాల్గొన్నారు.