పాముకాటుకు గురై వలస మహిళా కూలీ మృతి
వికారాబాద్ జిల్లా: పెద్దేముల్ మండలం జనగాం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పాముకాటుకు గురైన వలస మహిళా కూలీ చికిత్స పొందుతూ మృతి చెందింది.
జనగాం గ్రామానికి చెందిన మొహియుద్దీన్ ఫాంహౌస్‌లో గత కొన్ని రోజులుగా రంగారెడ్డి జిల్లా గుర్రంపల్లి గ్రామానికి చెందిన దంపతులు నర్సమ్మ (28), ఆంజనేయులు కూలీలుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఫాంహౌస్‌లో పని చేస్తుండగా నర్సమ్మను పాము కాటేసింది.
వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం తాండూరులోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో నర్సమ్మ మృతి చెందింది.
బతుకుదెరువు కోసం గుర్రంపల్లి నుంచి జనగాం గ్రామానికి వలస వచ్చిన కుటుంబంలో విషాదం నెలకొంది.
