ఆగస్టు 30, 31న సామాజిక శిక్షణ తరగతులను జయప్రదం చేయండి: కేవీపీఎస్

వికారాబాద్ జిల్లా…

ఆగస్టు 30, 31న సామాజిక శిక్షణ తరగతులను జయప్రదం చేయండి: కేవీపీఎస్

తాండూర్: ఆగస్టు 30, 31 తేదీల్లో వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) జిల్లాస్థాయి సామాజిక శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా మంగళవారం తాండూర్ పట్టణంలో శిక్షణ తరగతులకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం ఉప్పలి మల్కయ్య మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో రెండు రోజుల పాటు సామాజిక శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు.

జిల్లా నలుమూలల నుంచి ఎంపికైన సుమారు 300 మంది సామాజిక కార్యకర్తలు ఈ శిక్షణ తరగతులకు హాజరుకానున్నారని చెప్పారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, రిజర్వేషన్లు, జీవోలు, చట్టాలు, కులం, మతం, ఆర్థిక దోపిడీ, సామాజిక న్యాయం తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం సామాజిక ఉద్యమాల నిర్మాణంలో కీలకంగా పనిచేస్తోందని మల్కయ్య పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఏర్పాటు కోసం ప్రజా పోరాటాలను నిర్మించి విజయం సాధించామని తెలిపారు. కుల దురహంకారానికి వ్యతిరేకంగా, కులాంతర వివాహితుల రక్షణ కోసం పోరాటాలు కొనసాగిస్తున్నామని చెప్పారు.

దళితులపై దాడులు, దౌర్జన్యాలు జరిగినప్పుడు బాధితులకు కేవీపీఎస్ అండగా నిలుస్తుందని అన్నారు. రాజ్యాంగం, రిజర్వేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ విద్య, వైద్యం, ప్రజా పంపిణీ వ్యవస్థను పరిరక్షించేందుకు భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు చేపడతామని తెలిపారు. సామాజిక కార్యకర్తలకు అవగాహన, శిక్షణ కల్పించడంలో భాగంగానే ఈ తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, వై. రాములు, పిట్ల నర్సిములు, మంగ అశోక్ తదితరులు పాల్గొన్నారు.