సుద్ధ ఫ్యాక్టరీలో ప్రమాదం.. మహిళా కూలీ మృతి
వికారాబాద్ జిల్లా:
పెద్దేముల్ మండలం రుద్రారం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గట్టేపల్లి చంద్రకళ (40) కూలీ పనులకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందారు.
రుద్రారం గ్రామానికి చెందిన బుగ్గారెడ్డి ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తున్న చంద్రకళ.. ఫ్యాక్టరీలోని మిషన్ వద్ద పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె చీర కొంగు మిషన్‌లో ఇరుక్కుపోయింది. దీంతో ఆమె కిందపడిపోయి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
అయితే ఈ ఘటనపై ఇప్పటివరకు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పెద్దేముల్ ఎస్సై ప్రశాంత్ వర్ధన్ తెలిపారు. ఘటన జరిగినప్పటికీ పోలీసులకు ఫిర్యాదు అందకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం జరిగిన తీరుపై స్పష్టత రావాల్సి ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.
చంద్రకళ మృతితో రుద్రారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
