వికారాబాద్ జిల్లా తాండూర్
అభివృద్ధి పనులపై ఫోజులు కాదు.. నిధులు తెచ్చి పనులు చేసి చూపించాలి: ఏడవ వార్డు మాజీ కౌన్సిలర్ బాతుల మమతా నాగరాజు
తాండూర్: ఏడవ వార్డులో జరుగుతున్న సీసీ రోడ్ల అభివృద్ధి పనులపై మాజీ కౌన్సిలర్ బాతుల మమతా నాగరాజు ఘాటుగా స్పందించారు. మున్సిపల్ ఎన్నికలకు ముందే తాను రూ.50 లక్షల డీఎంఎఫ్‌టీ నిధులు మంజూరు చేయించి, అందులో రూ.46 లక్షలతో అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు తెలిపారు.
అదే నిధుల్లో మిగిలిన మొత్తంతో ప్రస్తుతం ఎన్టీఆర్ కాలనీలో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టినట్లు మమతా నాగరాజు పేర్కొన్నారు. తాము తీసుకొచ్చిన నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులకు కొందరు నాయకులు ఇప్పుడు ముందుండి ఫొటోలు దిగుతూ క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
కష్టం మాది ఫోటోకు పోజు మీది…?
“సొమ్మొకడిది.. సోకొకడిది అన్నట్టుగా ఫోజులు ఇవ్వడం కాదు. అభివృద్ధిపై నిజంగా శ్రద్ధ ఉంటే మీరే కష్టపడి నిధులు తీసుకురండి.. పనులు చేయించి చూపించండి” అని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు.
మున్సిపల్ ఎన్నికలకు ముందే ఏడవ వార్డులోని రాయల్ కంట సమీపంలో రూ.30 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేసినట్లు తెలిపారు. వార్డులో అభివృద్ధి పనులకు నిధులు తీసుకురావడం, పనులు పూర్తి చేయించడం తమ హయాంలోనే జరిగిందని స్పష్టం చేశారు.
“ప్రజలకు కనిపించేది ఫొటోలు కాదు.. పూర్తయిన అభివృద్ధి పనులు. ఎవరు నిధులు తీసుకొచ్చారు, ఎవరి హయాంలో పనులు జరిగాయో ఏడవ వార్డు ప్రజలకు తెలుసు. క్రెడిట్ కోసం ఫొటోలు దిగడం కాదు.. ప్రజలకు ఉపయోగపడేలా నిధులు తెచ్చి అభివృద్ధి చేసి చూపించాలి” అని బాతుల మమతా నాగరాజు అన్నారు.
