వికారాబాద్ జిల్లా తాండూర్
సొమ్ము ఎవడబ్బ సొత్తు కాదు.. ప్రజల సొత్తు: కౌన్సిలర్ ఇర్షాద్ ఘాటు వాక్యాలు
తాండూర్: వార్డ్ నెంబర్ 7లో జరుగుతున్న అభివృద్ధి పనులపై వస్తున్న రాజకీయ విమర్శలకు కౌన్సిలర్ ఇర్షాద్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకే కౌన్సిలర్‌గా ఎన్నికైన తర్వాత వార్డులో రోడ్ల అభివృద్ధి పనులు ప్రారంభించామని తెలిపారు.
“అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తున్నది ఎవరి వ్యక్తిగత సొమ్ము కాదు.. ప్రజల సొమ్ము. ప్రజలు చెల్లించే పన్నుల సొమ్ము. ఎవరు కౌన్సిలర్‌గా గెలిచినా ప్రజలకు అభివృద్ధి అందించడం వారి బాధ్యత” అని ఇర్షాద్ పేర్కొన్నారు.
ఐదేళ్లపాటు కౌన్సిలర్‌గా అవకాశం ఉన్న సమయంలో ప్రజల కోసం ఎన్ని పనులు చేపట్టారు? ఎన్ని సమస్యలను పరిష్కరించారో ముందుగా ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ఐదేళ్ల పాలనను ప్రజలు చూసిన తర్వాతే ఎన్నికల్లో 441 ఓట్ల మెజార్టీతో తీర్పు ఇచ్చారని అన్నారు.
“441 ఓట్ల మెజార్టీని తక్కువగా చూడొద్దు. అది నా వ్యక్తిగత గెలుపు కాదు.. ప్రజలు మీకు ఇచ్చిన గుణపాఠం. మీకు ఐదేళ్లు అవకాశం ఇచ్చిన ప్రజలు ఈసారి మాకు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం ఎందుకు ఇచ్చారో అర్థం చేసుకుని విమర్శలు చేయడం మానేసి ప్రజల కోసం పనిచేయండి” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
వార్డ్ నెంబర్ 7 అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని, రాజకీయ విమర్శలకు సమాధానం అభివృద్ధి పనులతోనే ఇస్తామని కౌన్సిలర్ ఇర్షాద్ స్పష్టం చేశారు.
“ప్రజల ఆశీర్వాదంతో అభివృద్ధి ఆగదు.. కొనసాగుతూనే ఉంటుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే మా బాధ్యత. వార్డ్ నెంబర్ 7 అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తాం” అని ఆయన అన్నారు.
