తాండూర్‌లో 1.150 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. బీహార్‌కు చెందిన వ్యక్తి అరెస్ట్

వికారాబాద్ జిల్లా | తాండూర్

తాండూర్‌లో 1.150 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. బీహార్‌కు చెందిన వ్యక్తి అరెస్ట్

తాండూర్, ఆగస్టు 5: నిజస్వరం ప్రతినిధి

Oplus_16908288

వికారాబాద్ జిల్లా మద్యనిషేధ మరియు ఆబ్కారీ అధికారి డి. శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో తాండూర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో 1.150 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకొని, ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రం కటిహార్ జిల్లా, బైరియా గ్రామానికి చెందిన ఎం.డి. ముస్తకీమ్ ప్రస్తుతం గౌతాపూర్ గ్రామంలోని గోపన్‌పల్లి ప్రాంతంలో ఉన్న టబ్రేజ్ స్టోన్ పాలిషింగ్ ఫ్యాక్టరీ వద్ద గంజాయి విక్రయాలు చేస్తున్నాడనే విశ్వసనీయ సమాచారం అందడంతో తాండూర్ ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నిందితుడి వద్ద నుంచి 1.150 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడిపై ఎక్సైజ్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు జిల్లా మద్యనిషేధ మరియు ఆబ్కారీ అధికారి డి. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

ఈ దాడుల్లో తాండూర్ ఎక్సైజ్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో ఎన్. రాణి, ఎస్‌ఐలు నిజాముద్దీన్, రవికుమార్‌తో పాటు సిబ్బంది విక్రమ్, అలీం, పండరి, రాజేష్, రామారావు, రాములు, సతీశ్, జార్జ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా మద్యనిషేధ మరియు ఆబ్కారీ అధికారి డి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, గంజాయి వంటి మాదకద్రవ్యాలను విక్రయించడం, నిల్వ ఉంచడం, రవాణా చేయడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన ప్రజలు వెంటనే ఎక్సైజ్ శాఖకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడుతోందని, ఈ కార్యక్రమంలో ప్రజల సహకారం ఎంతో అవసరం పేర్కొన్నారు.