జనన, మరణ ధ్రువపత్రాల జారీలో నిబంధనలు.

🔴 జనన, మరణ ధ్రువపత్రాల జారీలో నిబంధనలు కఠినతరం..ఆలస్యం చేశారో అంతే.

21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి

గడువు దాటితే తిప్పలు తప్పవు

ఈ నెల నుంచే అమలు జనన, మరణ ధ్రువపత్రాల జారీకి సంబంధించి ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల ఒకటో తేదీ నుంచే ఈ కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి.

ఇంట్లో ఎవరైన పుట్టినా లేదా మరణించినా 21 రోజుల్లోపు సంబంధిత ధ్రువపత్రాల కోసం కుటుంబ సభ్యులు గ్రామ పంచాయతీలు, నగర పంచాయతీలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో దరఖాస్తు చేసుకోవాలి. గడువు దాటితే ధ్రువపత్రాలు పొందేందుకు తిప్పలు తప్పవు. 21 రోజులు దాటి ఒక సంవత్సరంలోపు దరఖాస్తు చేసుకుంటే నిబంధనల ప్రకారం నిర్ణయించిన ఆలస్య రుసుం చెల్లించి స్థానిక అధికారుల ద్వారా ధ్రువపత్రాలు పొందాల్సి ఉంటుంది.

ఒక సంవత్సరం నుంచి రెండేళ్లు ఆలస్యమైతే సంబంధిత జిల్లా మేజిస్ట్రేట్‌, సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ లేదా వారు అధికారం కల్పించిన ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. రెండేళ్లు దాటితే స్థానిక అధికారులు నేరుగా జనన, మరణ ధ్రువపత్రాలను జారీ చేయరు. దీనికి కచ్చితంగా ఫస్ట్‌ క్లాస్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు నుంచి ప్రత్యేక ఉత్తర్వులు తెచ్చుకోవలసి ఉంటుంది.

అయితే, ఒక సంవత్సరం దాటిన తరువాత సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, ఆ సమాచారం సరైనదే అని ధ్రువీకరణకు వస్తేనే ధ్రువపత్రం మంజూరవుతుంది.