ఉద్యమకారుల కోసం ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశాలు.

🔴 ఉద్యమకారుల కోసం ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశాలు.

హర్షం వ్యక్తం చేసిన తాండూరు ఉద్యమకారులు

ఉద్యమకారులకు గుర్తింపు ఇచ్చి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి.

నిజస్వరం తాండూర్ ప్రతినిధి ::

తాండూరు: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు తగిన గుర్తింపు కల్పించి, వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తాండూరు నియోజకవర్గ ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యమకారుల వివరాల నమోదు కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించడాన్ని స్వాగతిస్తూ, ముఖ్యమంత్రికి పాలాభిషేకం నిర్వహించారు.

ఉద్యమకారుల కమిటీ అధ్యక్షుడు కేశవరావు విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న వారి పూర్తి వివరాలను సేకరించేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌), ప్రణాళిక సంఘం కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసినట్లు ఉద్యమకారులు తెలిపారు. ఉద్యమ సమయంలో నమోదైన కేసులు, ఉద్యమంలో పాల్గొన్న వివరాలు, ఇతర సంబంధిత సమాచారాన్ని నమోదు చేసేందుకు వీలుగా ప్రత్యేక వెబ్‌సైట్‌ను త్వరితగతిన ఏర్పాటు చేయాలని సీఎం సూచించడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక మంది ఉద్యమకారులు తమ జీవితాలను, సమయాన్ని, శ్రమను వెచ్చించి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని వారు పేర్కొన్నారు. అలాంటి ఉద్యమకారులను గుర్తించి, వారి వివరాలను అధికారికంగా నమోదు చేయడం ద్వారా అర్హులైన వారికి ప్రభుత్వ గుర్తింపు లభించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటు ద్వారా ఉద్యమకారుల వివరాల సేకరణ మరింత సులభతరం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి, అర్హులైన ఉద్యమకారులకు సంక్షేమ పథకాలను అమలు చేయాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. ఉద్యమకారులకు అందాల్సిన ప్రయోజనాలు ఆలస్యం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వెబ్‌సైట్ ఏర్పాటు అనంతరం వివరాల నమోదు, పరిశీలన ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూడాలని కోరారు.

ఉద్యమకారుల గుర్తింపు కోసం స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ తాండూరు నియోజకవర్గానికి చెందిన ఉద్యమకారులు పాలాభిషేకం నిర్వహించారు. ప్రభుత్వం త్వరలోనే తదుపరి చర్యలు చేపట్టి ఉద్యమకారుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో తాండూరు నియోజకవర్గ ఉద్యమకారులు ఒంగోని బాయ్ శ్రీనివాస్, జిలాని, సంజయ్ గౌడ్, అశోక్, ప్రకాష్ గౌడ్, ఆకుల శివకుమార్, అశోక్, మొయిజ్ బేగ్, శివ, ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు.