కూరగాయల విక్రయ స్థలాలపై వివాదం
వికారాబాద్ జిల్లా తాండూర్: పాత మున్సిపాలిటీ ముందు కూరగాయలు విక్రయించేందుకు మున్సిపల్ అధికారులు బాక్సులుగా ముగ్గు వేసి స్థలాలను కేటాయించడంతో వివాదం నెలకొంది.
కేటాయించిన స్థలాల్లో కొత్త, పాత వ్యాపారులు ఎవరికి స్థలం ఇవ్వాలనే అంశంపై ఒకరిపై ఒకరు వాగ్వాదానికి దిగారు.
తమకు మాత్రమే స్థలాలు కేటాయించాలని కూరగాయలు విక్రయిస్తున్న పాత వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు కొత్తగా కూరగాయల వ్యాపారం చేసుకునే వారికి కూడా స్థలాలు కేటాయించాలని కొందరు కోరుతున్నారు. ఈ విషయంపై మున్సిపల్ సిబ్బందితో పలువురు వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
పాత, కొత్త వ్యాపారుల మధ్య నెలకొన్న ఈ వివాదం ప్రస్తుతం మున్సిపల్ సిబ్బందికి తలనొప్పిగా మారింది.
సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి, అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వ్యాపారులు కోరుతున్నారు.
