కల్తీకల్లు కారణంగానే మామా, అల్లుడి మృతి..
ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యంపై KVPS జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య ఆగ్రహం
వికారాబాద్ జిల్లా, యాలాల: కోకట్ గ్రామ శివారులో చోటుచేసుకున్న మామా, అల్లుడి అనుమానాస్పద మృతుల ఘటన దురదృష్టకరమని KVPS జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య అన్నారు. కల్తీకల్లు కారణంగానే ఈ ఘటన జరిగిందని ఆయన ఆరోపించారు.
తాండూర్ నియోజకవర్గ పరిధిలో కల్తీకల్లు విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని, అయితే ఎక్సైజ్ శాఖ అధికారులు నిద్రమత్తులో ఉన్నట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కల్లు దుకాణాలు, కల్లు విక్రయ కేంద్రాలపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు.
కోకట్ పరిసరాల్లో జరిగిన మామా, అల్లుడి మృతుల ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని మల్కయ్య డిమాండ్ చేశారు. పోస్టుమార్టం నివేదిక వెలువడిన అనంతరం వాస్తవ కారణాలను నిర్ధారించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
అలాగే మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని, బాధిత కుటుంబ సభ్యులకు తగిన ఆర్థిక సహాయం అందించాలని ఉప్పలి మల్కయ్య విజ్ఞప్తి చేశారు.
