వికారాబాద్ జిల్లా | తాండూర్
బంగారం కొనుగోలు పేరుతో జ్యువెలరీ షాపులో చోరీ.. 10 గ్రాముల బంగారు నెక్లెస్ అపహరణ
తాండూర్ పట్టణంలోని గాంధీచౌక్‌లో ఉన్న గంజిపల్లి సాయి జ్యువెలర్స్‌లో బంగారం కొనుగోలు చేయడానికి వచ్చిన ఐదుగురు సభ్యుల ముఠా చాకచక్యంగా 10 గ్రాముల బంగారు నెక్లెస్‌ను అపహరించిన ఘటన గురువారం చోటుచేసుకుంది.
షాపులోకి వినియోగదారుల్లా ప్రవేశించిన ముఠా సభ్యులు సిబ్బందిని వివిధ బంగారు డిజైన్లు చూపించాలని కోరుతూ మాటల్లో పెట్టారు. ఈ క్రమంలో సిబ్బంది దృష్టి మరల్చి, కౌంటర్లోని షోకేస్‌లో ఉన్న సుమారు 10 గ్రాముల బంగారు నెక్లెస్‌ను అపహరించి అక్కడి నుంచి పరారయ్యారు.
సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా, చోరీకి పాల్పడిన ముఠాలో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు, ఒక బాలుడు ఉన్నట్లు గుర్తించారు. ఈ చోరీ దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కావడంతో వాటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనపై షాపు యజమాని అమన్ సింగ్ తాండూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.
