గరికపాటి ఉపాధ్యాయులకు క్షమాపణ చెప్పాలి.

🔴 గరికపాటి ఉపాధ్యాయులకు క్షమాపణ చెప్పాలి.

ఉపాధ్యాయులు చదువును పక్కనబెట్టి గుడ్ల లెక్కలు రాస్తున్నారు

నిజస్వరం తాండూర్ ప్రతినిధి ::

గరికపాటి నరసింహారావు పేద పిల్లల మధ్యాహ్న భోజనం పై అవమానకర వ్యాఖ్యలు గర్హనీయం వెంటనే ఉపసంహరణ, క్షమాపణ చెప్పాలి టీఎస్ యుటిఎఫ్

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, నిరుపేద, సామాజికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం పై ఇటీవల గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా అవమానకరంగా, బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మండల అధ్యక్ష కార్యదర్శులు గౌరారం గోపాల్ ఎండి అలీముద్దీన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు . వెంటనే ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బడుగు బలహీన వర్గాల సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు .

ఈ సందర్భంగా వారు పాత్రికేయులకు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ వారు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు అనేవి ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు విద్యా ఆలయాలుగా నిలుస్తున్నాయి. ఇటువంటి పరిస్థితిలో వారికి అందుతున్న కొద్దిపాటి పౌష్టికాహారాన్ని, ముఖ్యంగా గుడ్డు వంటి పోషకాహారాన్ని తక్కువ చేసి చూపే విధంగా వ్యాఖ్యలు చేయడం పేద పిల్లల విద్యా ప్రస్థానాన్ని నిరుత్సాహపరిచే చర్యగా ఉందన్నారు.

ఉపాధ్యాయులపై నిజమైన శ్రద్ధ ఉంటే మధ్యాహ్న భోజన నిర్వహణ వల్ల బోధన సమయం తగ్గుతుందని భావించిన వారు, ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులకు భారం లేకుండా ప్రత్యేక సిబ్బందిని నియమించి పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరాల్సింది. అయితే గుడ్డు గాడిద గుడ్డు వంటి వ్యాఖ్యలతో ఉపాధ్యాయులు చదువును పక్కనబెట్టి గుడ్ల లెక్కలు రాస్తున్నారు, గుడ్లను మింగేస్తున్నారు. అనే వ్యాఖ్యలు చేయడం ఉపాధ్యాయ వృత్తి గౌరవాన్ని దెబ్బతీసే చర్యగా పేర్కొన్నారు.

మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం వంటి సౌకర్యాలు పొందుతున్న విద్యార్థులను శోభనం పెళ్లికొడుకు లాగా వస్తున్నారు చదువుతారా అనే భావన కలిగించేలా మాట్లాడటం తిండికి కూడా నోచుకోని పేద పిల్లల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవానికి అనేక మంది విద్యార్థులు ఆకలితో బడికి వస్తున్నారు. ప్రార్థన సమయంలోనే అలసటతో పడిపోతున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. ఆడపిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నారు. చాలా మంది పిల్లలు తగిన బరువు లేక పోషకాహార లోపంతో బాధపడుతున్న దుస్థితి ప్రభుత్వ పాఠశాలల్లో కనిపిస్తోందని వారు గుర్తు చేశారు.

ఇలాంటి సందర్భంలో మధ్యాహ్న భోజనం వంటి పథకాలు విద్యార్థుల హాజరు, ఆరోగ్యం, విద్యా కొనసాగింపుకు కీలకంగా మారాయి. పేద పిల్లలకు భోజనం, బట్టలు, పుస్తకాలు, బ్యాగులు వంటి కనీస సౌకర్యాలు కల్పించడం విద్య హక్కు చట్టం 2009లో భాగమే కాకుండా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో పేర్కొన్న జీవించే హక్కులో అంతర్భాగమని, సమాన విద్యా అవకాశాలు కల్పించడం రాజ్యాంగబద్ధ బాధ్యత అని పేర్కొన్నారు.

తమ భోజనం, తమ బట్టలు కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్న పేద పిల్లలను బడి మానేయమనే భావన కలిగించే వ్యాఖ్యలు వారి మౌలిక హక్కులను కాలరాసే మాటలుగా ఉన్నాయన్నారు. పేద పిల్లలు చదువు మానేస్తే వారు తిరిగి బాల కార్మికత్వం, సామాజిక దోపిడీ వైపు నెట్టబడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించే అంశమని పేర్కొన్నారు.

అందువల్ల ఇటువంటి అనాగరిక వ్యాఖ్యలు చేసిన గరికపాటి నరసింహారావుపై తగిన చర్యలు తీసుకోవాలని, ఆయనకు ప్రదానం చేసిన పద్మశ్రీ బిరుదును పునఃపరిశీలించాలన్నారు భవిష్యత్తులో పేద పిల్లల విద్యను నిరుత్సాహపరిచే లేదా మధ్యాహ్న భోజన పథకాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు జరిగితే ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆందోళనలు చేపట్టేందుకు వెనుకాడబోమని వారు స్పష్టం చేశారు.