నిరుపేదల సొంతింటి కల త్వరలో సాకారం.. 

నిరుపేదల సొంతింటి కల త్వరలో సాకారం.. 

 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తో కలిసి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పరిశీలన.

వేగవంతంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మరమ్మత్తుల పనులకు ఆదేశం..
మాత శిశు ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే, కలెక్టర్లు.

నిజస్వరం తాండూరు :: ప్రతినిధి ::   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు నిరుపేదల కోసం గొప్ప నిర్ణయం తీసుకోబోతుంది. గూడు లేని నిరుపేదలకు సొంతింటి కలను నిజం చేసేందుకు అడుగులు వేస్తుంది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు నియోజకవర్గ ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించడంతో ఎమ్మెల్యే లు వాటి అమలు కోసం దృష్టిని కేంద్రీకరించారు. తాండూరు శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తో కలిసి నేడు పట్టణ శివారు ప్రాంతం హైదరాబాద్ రోడ్డు సమీపంలో నిర్మాణ దశలో ఆగిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో తాండూరులో వివిధ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు ఇప్పటికే నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని అన్నారు. వీటిలో కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయని, కొన్ని గ్రామాల్లో గృహప్రవేశం కూడా చేయడం జరిగిందని తెలిపారు. నిరుపేదలైన ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఖాళీ స్థలం లేని అర్హులైన పేదవారికి నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్స్ ఇండ్లను కేటాయించడం జరుగుతుందని అన్నారు. ఇందుకోసం అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తి చేసిన అనంతరం ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో అర్హుల జాబితాను సిద్ధం చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి నిరుపేదలకు ఇండ్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం దేనని ఎమ్మెల్యే భరోసా కల్పించారు. అనంతరం మాత శిశు ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ తో కలిసి సందర్శించారు. ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వైద్య సిబ్బందితో మాట్లాడుతూ ఆసుపత్రిలో గల సమస్యలను వారికి ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తో పాటు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ సుధీర్, మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, డి సి హెచ్ ఎస్ ఆనంద్, ఆస్పత్రి సూపరిటెండెంట్ వినయ్ కుమార్, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.