చిన్నారుల ఆరోగ్యంతో చెలగాటం.. కల్తీ వ్యాపారం బట్టబయలు!

వికారాబాద్ జిల్లా తాండూర్…

పిల్లలు తినే తినుబండారాల కల్తీ గుట్టు రట్టు

 సింథటిక్ కెమికల్స్‌తో కల్తీ దందా.. పట్టుకున్న పోలీసులు!

పిల్లలు తినే తినుబండారాలను కల్తీ చేస్తూ విక్రయిస్తున్న వ్యాపారి గుట్టును ఫుడ్ సేఫ్టీ, తాండూరు పట్టణ పోలీసులు రట్టు చేశారు. తాండూరు పట్టణంలోని గంజ్‌ ప్రాంతంలో ఓ ఇంటిపై అధికారులు, పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో సుందర్ అనే వ్యక్తి ఇంట్లోనే తినుబండారాలను తయారు చేసి హోల్‌సేల్‌గా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. తనిఖీల్లో సింథటిక్ కెమికల్స్, పాడైపోయిన చక్కెరతో పాటు చిన్నారులు తినే పలు రకాల కాలం చెల్లిన తినుబండారాలను అధికారులు గుర్తించారు.అనుమానాస్పదంగా ఉన్న తినుబండారాలు, ఇతర పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. సుందర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కల్తీ ఆహార పదార్థాల తయారీ, విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు. ప్రజలకు అనుమానాస్పద ఆహార పదార్థాల విక్రయాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.