ఎన్నికల సమయంలో హామీలు.. గెలిచాక వార్డుపై నిర్లక్ష్యం..!

వికారాబాద్ జిల్లా తాండూర్

తాండూర్ పట్టణం 27వ వార్డులో కానరాని కౌన్సిలర్..!
ఎన్నికల సమయంలో హామీలు.. గెలిచాక వార్డుపై నిర్లక్ష్యం..!
సమస్యలతో సతమతమవుతున్నామని వార్డు ప్రజల ఆగ్రహం

తాండూర్ పట్టణంలోని 27వ వార్డు ప్రజలు తమ కౌన్సిలర్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇంటింటికీ తిరుగుతూ అభివృద్ధి హామీలు ఇచ్చిన కౌన్సిలర్, ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మాత్రం వార్డును పూర్తిగా నిర్లక్ష్యం చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

వార్డులో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, డ్రైనేజీ, వీధి దీపాలు, రోడ్ల మరమ్మతులు వంటి అనేక సమస్యలు నెలకొన్నప్పటికీ వాటి పరిష్కారానికి ఎలాంటి చర్యలు కనిపించడం లేదని ప్రజలు వాపోతున్నారు. సమస్యలపై పలుమార్లు కౌన్సిలర్ కి ఫోన్ చేసి, ఫిర్యాదు చేసినా ఆశించిన స్పందన లభించలేదని వారు చెబుతున్నారు. కొన్ని సమయాల్లో ఫోన్ కూడా లేపడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల అవసరాలు తెలుసుకునేందుకు కౌన్సిలర్ వార్డును సందర్శించడం లేదని, ప్రజలకు అందుబాటులో కూడా ఉండటం లేదని స్థానికులు ఆరోపించారు. ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలను గుర్తు చేసుకుని, గెలిచిన తర్వాత వారిని పట్టించుకోకపోవడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వార్డులోని పాదచారులు మార్కెట్లో తిరగటానికి కష్టంగా ఉందని, మురికినాళాల నుండి మురుగు నీరు బయటికి వస్తుందని, మార్కెట్లో నిత్యం తిరిగే ప్రజలు, స్కూలుకు వెళ్లే విద్యార్థులు అష్ట కష్టాలు పడుతున్నారని వార్డు ప్రజలు పేర్కొన్నారు.

వార్డు సమస్యలు చూడలేక స్థానికులే నాళాలు, రోడ్లు స్వయంగా శుభ్రపరచుకుంటున్నారు.

ఇప్పటికైనా కౌన్సిలర్, సంబంధిత అధికారులు వార్డును సందర్శించి సమస్యలను పరిశీలించి, అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని 27వ వార్డు ప్రజలు కోరుతున్నారు.