2 న అనంతగిరి కి రాహుల్ గాంధీ రాక.
నిజస్వరం వికారాబాద్ ప్రతినిధి::
వచ్చే నెల మార్చి 2వ తేదీన వికారాబాద్ జిల్లా అనంతగిరి లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతరులు పర్యటించనున్న నేపథ్యంలో, జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా ఐ.పి.ఎస్. ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పోలీసు అధికారులతో కలిసి బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు మరియు ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై ఎస్పీ గారు సుదీర్ఘంగా చర్చించారు.
వివిఐపిల పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యున్నత స్థాయి భద్రతను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
సమావేశంలో భాగంగా ఎస్పీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పి పి టీ ) ద్వారా బందోబస్తుకు సంబంధించిన పూర్తి ప్రణాళికను వివరించారు. ముఖ్యంగా హెలిప్యాడ్ వద్ద భద్రత, కాన్వాయ్ ప్రయాణించే రూట్ మ్యాప్, సభా ప్రాంగణం వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. పర్యటన సాగే మార్గాల్లో ముందస్తుగా తనిఖీలు చేపట్టాలని, ఎక్కడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే ప్రతి పోలీసు అధికారి అప్రమత్తంగా ఉండి, సమన్వయంతో పనిచేయాలని ఆమె స్పష్టం చేశారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, పర్యటన ప్రశాంతంగా ముగిసేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఇట్టి సంధార్బంగా పోలీస్ అధికారులకు తెలియజేయడం జరిగింది.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ బి.రాములు నాయక్, పరిగి డిఎస్‌పి శ్రీనివాస్, వికారాబాద్ డిఎస్‌పి శ్రీనివాస్ రెడ్డి, తాండూర్ ఇంచార్జ్ డీఎస్పీ శ్రీనివాసులు,డిసిఆర్‌బి డిఎస్‌పి జానయ్య, ఏఆర్ డిఎస్‌పి వీరేష్, సీఐలు,ఆర్‌ఐ లు,ఎస్‌ఐ లు,ఆర్‌ఎస్‌ఐ లు మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
