వికారాబాద్ జిల్లా తాండూర్
ఎదురుచూపులకు తెర.. తాండూర్‌లోకి అడుగుపెట్టనున్న పైలట్ రోహిత్ రెడ్డి..
ట్రయల్ కోర్టు పరిధి వీడరాదన్న షరతుకు హైకోర్టు సడలింపు
దర్యాప్తు కీలక దశ పూర్తయిందని పిటిషనర్ తరఫు వాదనకు ప్రాధాన్యం
మిగతా అన్ని షరతులు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టీకరణ
ప్రజల్లోకి రానున్న పైలట్.. తాండూర్‌లో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్
తాండూర్, జూలై 22: తాండూర్ నియోజకవర్గ ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఎట్టకేలకు ఆసన్నమైంది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు కీలక ఊరట కల్పించింది. ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా కోర్టు పరిధిని వీడరాదన్న షరతును సడలిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తాండూర్ ప్రజల ఎదురుచూపులకు తెరపడగా, త్వరలోనే పైలట్ రోహిత్ రెడ్డి ప్రజల మధ్యకు రానుండటంతో నియోజకవర్గంలో రాజకీయ సందడి నెలకొంది.
తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు, గతంలో విధించిన బెయిల్ షరతుల్లో ఒకటైన “ట్రయల్ కోర్టు ముందస్తు అనుమతి లేకుండా కోర్టు పరిధిని వీడరాదు” అనే నిబంధనను సడలించింది. దర్యాప్తులో కీలక భాగం ఇప్పటికే పూర్తయిందని, తాను తన నియోజకవర్గంలోనే నివసిస్తున్నానని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
వాదనలు విన్న న్యాయస్థానం ఆ షరతును సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మిగిలిన అన్ని బెయిల్ షరతులు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.
ఈ పరిణామంతో తాండూర్ నియోజకవర్గంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గత కొంతకాలంగా తమ నాయకుడు ప్రజల్లోకి రావాలని, నియోజకవర్గ పర్యటనలు చేపట్టాలని ఎదురుచూస్తున్న కార్యకర్తలు, అభిమానులు, ప్రజల ఆశలు ఫలించాయని పేర్కొంటున్నారు. త్వరలోనే పైలట్ రోహిత్ రెడ్డి ప్రజల మధ్యకు రానుండటంతో తాండూర్ రాజకీయాల్లో మరోసారి కొత్త ఉత్సాహం నెలకొంది.
