తాండూరులో FMGE హౌస్ సర్జన్ల నిరసన.. రెండో రోజుకు!
వికారాబాద్ జిల్లా, తాండూరు:
సమాన స్టైపెండ్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ FMGE హౌస్ సర్జన్లు చేపట్టిన శాంతియుత నిరసన రెండో రోజుకు చేరింది. కొడంగల్‌లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో విధులు బహిష్కరించి తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు.
సుప్రీంకోర్టు, నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) ఆదేశాలకు అనుగుణంగా తమకు రావాల్సిన స్టైపెండ్ చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. IMG ఇంటర్న్‌లతో సమానంగా వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ, తమకు సమానమైన స్టైపెండ్ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నెలకు రూ.29,792 స్టైపెండ్ చెల్లించాలని కోరుతూ OP, OT, వార్డు సేవలను బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. స్టైపెండ్ విషయంలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (TSMC) నుంచి తదుపరి అధికారిక ఉత్తర్వులు వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
సంబంధిత అధికారులు తమ సమస్యపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే, ఈ నెల 14న హైదరాబాద్‌లోని డీఎంఈ కార్యాలయం లేదా ధర్నా చౌక్ వద్ద నిరసన చేపడతామని హెచ్చరించారు.
“సమాన పనికి సమాన వేతనం” అనే నినాదంతో తమ హక్కుల సాధన కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని FMGE హౌస్ సర్జన్లు తెలిపారు.
