తాండూరులో ప్రపంచ హృదయ దినోత్సవం
ఆరోగ్యకరమైన జీవనశైలితో గుండెకు రక్షణ
లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు: వైద్యులు
వికారాబాద్ జిల్లా తాండూరులో ప్రపంచ హృదయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
గుండె ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు.
తాండూరు పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన ఈ కార్యక్రమానికి IMA అధ్యక్షులు డా. జయప్రసాద్ ఆధ్వర్యం వహించారు.
ఈ సందర్భంగా డా. జయప్రసాద్ మాట్లాడుతూ.. అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, పొగతాగడం, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలతో గుండె జబ్బుల ముప్పు పెరుగుతుందని తెలిపారు.
ప్రతిరోజూ వ్యాయామం చేయడంతో పాటు ఉప్పు, చక్కెర, కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని తగ్గించాలని సూచించారు. రక్తపోటు, షుగర్, కొలెస్ట్రాల్‌ను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలని తెలిపారు.
ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, విపరీతమైన చెమటలు, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
చిన్న వయస్సు నుంచే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుంటే గుండె జబ్బుల ముప్పును తగ్గించుకోవచ్చని వైద్యులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో IMA జనరల్ సెక్రెటరీ అనిల్ కుమార్, ట్రెజరర్ జైదీప్ రెడ్డి తదితర వైద్యులు పాల్గొన్నారు.
