నాపరాతి పరిశ్రమల పరిరక్షణకు కేంద్రం చర్యలు తీసుకోవాలి: బీఎంఆర్

వికారాబాద్ జిల్లా…

తాండూర్ నాపరాతి పరిశ్రమలకు రక్షణ కల్పించాలి: ఎమ్మెల్యే బీఎంఆర్

తాండూర్: తాండూర్ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన నాపరాతి పరిశ్రమలను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (బీఎంఆర్) కోరారు. నాపరాతి వ్యాపారులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

ఈ మేరకు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి వినతిపత్రం అందజేశారు. తాండూర్ ప్రాంతంలో నాపరాతి, మైనింగ్ పరిశ్రమలు విస్తరించి ఉండటంతో స్థానికంగా వేలాది కుటుంబాలకు ఉపాధి లభిస్తోందని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి సైతం అనేక మంది ఉపాధి కోసం తాండూర్‌కు వచ్చి జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చిన్నతరహా పరిశ్రమలను భారీ పరిశ్రమలుగా రూపాంతరం చేసే విధంగా తీసుకొస్తున్న నూతన నిబంధనల వల్ల తాండూర్‌లోని నాపరాతి పరిశ్రమలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నతరహా పరిశ్రమలు భారీ పరిశ్రమలుగా మారితే స్థానిక వ్యాపారులపై అదనపు ఆర్థిక భారం పడే ప్రమాదం ఉందన్నారు.

అదేవిధంగా రాయల్టీ చార్జీల పెంపు వల్ల వ్యాపారులపై భారం పెరగడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంపైనా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. నాపరాతి పరిశ్రమలు దెబ్బతింటే వ్యాపారులు నష్టపోవడంతో పాటు వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. దీంతో పలువురు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

తాండూర్ ప్రజలు, నాపరాతి వ్యాపారులు, కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నాపరాతి పరిశ్రమలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బీఎంఆర్ కోరారు. నూతన నిబంధనలను పునఃపరిశీలించి తాండూర్ నాపరాతి పరిశ్రమలకు రక్షణ కల్పించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.