వికారాబాద్ జిల్లా….
ROB పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే BMR
తాండూరు: పాత తాండూరులో నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) పనుల పురోగతిని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ పనులపై అధికారులను, కాంట్రాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ROB పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. నిర్మాణ దశలో ఇళ్లు కోల్పోయిన వారికి, ఆస్తి నష్టం జరిగిన వారికి డబుల్ బెడ్‌రూం, ఇందిరమ్మ ఇళ్లతో పాటు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ROB పూర్తయితే పాత తాండూరులో ట్రాఫిక్ సమస్యలు, రైల్వే గేట్ వద్ద వాహనాల రద్దీ గణనీయంగా తగ్గి ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
నిర్మాణ పనుల కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా డ్రైనేజీ, విద్యుత్ స్తంభాల మార్పు తదితర పనులను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చేపట్టాలని సూచించారు. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.
పాత తాండూరు ప్రజల అవసరాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని ROB పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, R&B, మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ శాఖల అధికారులు, కాంట్రాక్టర్లు, నాయకులు పాల్గొన్నారు.
