వినాయక చౌక్‌లో వివాదాస్పద ఎవక్యూ ప్రాపర్టీపై అక్రమ నిర్మాణాల ఆరోపణలు ప్రభుత్వ ఆస్తిని కాపాడాలని ఠాకూర్ సూరజ్ సింగ్ డిమాండ్

వినాయక చౌక్‌లో వివాదాస్పద ఎవక్యూ ప్రాపర్టీపై అక్రమ నిర్మాణాల ఆరోపణలు

తాండూరు, వికారాబాద్ జిల్లా:

తాండూరు పాత కూరగాయల మార్కెట్‌ రోడ్డులోని వినాయక చౌక్‌ వద్ద ఉన్న కొన్ని ఆస్తులపై అక్రమ నిర్మాణాలు చేపట్టి, ఒక్కో దుకాణాన్ని రూ.2 నుంచి రూ.3 కోట్లకు విక్రయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని జనసత్తా వెల్ఫేర్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడు ఠాకూర్ సూరజ్ సింగ్ ఆరోపించారు.

D.No. 5-7-8/1, 5-7-75, 5-7-76, 5-7-76/1, 5-7-77, 5-7-78, 5-7-79 నెంబర్లతో ఉన్న ఆస్తులు ప్రభుత్వానికి చెందినవని, అవి వివాదాస్పద ఎవక్యూ ప్రాపర్టీ ఆస్తులని ఆయన పేర్కొన్నారు. చట్టబద్ధ యజమాని లేని ఈ ఆస్తులకు సంబంధించి కొందరు తప్పుడు పత్రాలు సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఆరోపించారు.

ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినట్లు సూరజ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. సంబంధిత ఆస్తుల స్వభావం, మూల హక్కులను నిర్ధారించేందుకు తన వద్ద తగిన పత్రాలు, ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎవక్యూ ప్రాపర్టీకి సంబంధించిన రికార్డులను పునర్నిర్మించి వాస్తవాలను నిరూపిస్తానన్నారు.

ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన అధికారులు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎవక్యూ ప్రాపర్టీ ఆస్తుల రికార్డులను దాచారా, ధ్వంసం చేశారా లేదా అందుబాటులో లేకుండా చేశారా అనే విషయంపై తహసీల్దార్ వివరణ ఇవ్వాలని కోరారు.

ఇప్పటికే తాను ఇచ్చిన ఫిర్యాదును ఉన్నతాధికారులు విచారణ నిమిత్తం తాండూరు పోలీస్ స్టేషన్‌కు పంపించారని, ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఈ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వివాదాస్పద ఆస్తులను ప్రజలు, కొనుగోలుదారులు కొనుగోలు చేయవద్దని, మోసపూరిత ప్రకటనలను నమ్మి నష్టపోవద్దని ఠాకూర్ సూరజ్ సింగ్ సూచించారు.