గోనూర్ రహదారిపై ముళ్ల చెట్లతో ప్రమాద ముప్పు
వికారాబాద్ జిల్లా, తాండూర్ మండలం:
తాండూర్ మండలం గోనూర్ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై ఇరువైపులా ముళ్ల చెట్లు దట్టంగా పెరిగి రోడ్డుపైకి వేలాడుతున్నాయి. దీంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు తెలిపారు.
ముళ్ల చెట్ల కారణంగా రహదారి ఇరుకుగా మారడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

“ఏదైనా ప్రమాదం జరిగితే గానీ అధికారులు స్పందించరా?” అంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహదారిపై పెరిగిన ముళ్ల చెట్లను తొలగించాలని పలుమార్లు గ్రామ సర్పంచ్, గ్రామ సెక్రటరీ, గ్రామ నాయకుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకుండా పిడచెవిన పెడుతున్నారని గ్రామస్తులు వాపోయారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారికి ఇరువైపులా పెరిగిన ముళ్ల చెట్లను వెంటనే తొలగించాలని, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
