జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ వేధింపులు.

🔴 జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ వేధింపులు

ఎమ్మెల్యేకు నర్సింగ్ సిబ్బంది ఫిర్యాదు
విధినిర్వహణలో ఉండే నర్సింగ్ సిబ్బందిపై అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని ఫిర్యాదు
జిల్లా ఆసుపత్రికి కోఆర్డినేటర్ ద్వారా నిజనిర్ధారణ చేసుకున్న ఎమ్మెల్యే

నిజస్వరం తాండూర్ ప్రతినిధి ::

కొన్నాళ్లుగా వికారాబాద్ జిల్లా తాండూరు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ వినయ్ కుమార్ నర్సింగ్ సిబ్బందిపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. అయితే సూపరింటెండెంట్ వినయ్ వేధింపులు తారస్థాయికి చేరడంతో మంగళవారం పలువురు నర్సింగ్ సిబ్బంది తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి, అలాగే వికారాబాద్ జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త (డిసిహెచ్ఎస్) డాక్టర్ ఆనంద్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో నర్సింగ్ సిబ్బంది కలిసి సూపరింటెండెంట్ ఆగడాలను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు.

ముఖ్యంగా నర్సింగ్ సిబ్బంది విధులకు సంబంధించిన వ్యవహారాల్లో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ వినయ్ నిబంధనలకు విరుద్ధంగా జోక్యం చేసుకొని జిల్లా ఆసుపత్రి ఎం సి హెచ్ ఆసుపత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ లను కూడా వేధింపులకు గురి చేస్తున్నట్లు నర్సింగ్ సిబ్బంది ఫిర్యాదుల పేర్కొన్నారు.

తనకు అనుకూలంగా వ్యవహరిస్తేనే మీరు డ్యూటీ చేస్తారని లేదంటే నేను మూడో కన్ను తెరుస్తానని నా విషయం మీకు కొంతే తెలుసు నా మాట వినకుంటే ఇంకేమైనా చేస్తానంటూ నర్సింగ్ సిబ్బందిని వేధింపులకు గురి చేయడం వినయ్ కుమార్ అలవాటుగా పెట్టుకున్నట్లు ఫిర్యాదు చేశారు.

సిబ్బందికి సెలవులు మంజూరులో కూడా ఆయన వేధింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్యూటీ రోస్టర్ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా జోక్యం చేసుకొని తాను చెప్పినట్లు సిబ్బందికి డ్యూటీలు వేయాలని నర్సింగ్ సూపరిండెంట్లను కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదు చేశారు.

దీంతో సూపరింటెండెంట్ వేధింపుల వల్ల తాము మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నామని తమ ఆత్మగౌరవం దెబ్బతింటుందని నర్సింగ్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. కొన్ని సందర్భాల్లో ఆయన వికృత చేష్టలకు పాల్పడుతున్నారని కూడా ఫిర్యాదు చేశారు. నర్సింగ్ సిబ్బంది మాస్కులు పెట్టుకుంటే వాటిని తీసివేయాలని హుకుం జారీ చేస్తారని వాపోయారు. సీనియర్ నర్సింగ్ సిబ్బందిని కూడా వేధింపులకు గురిచేసి రాక్షసానందం పొందుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

డ్యూటీ సమయంలోనే సూపరింటెండెంట్ తన ఛాంబర్ లోనే మద్యం తాగి ఆ మత్తులో వికృత చేష్టలకు పాల్పడుతున్నారని వారు తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ విషయంపై తాండూరు ఎమ్మెల్యే బు య్యని మనోహర్ రెడ్డి వికారాబాద్ జిల్లా డీసీహెచ్ఎస్ ఆనంద్ తో మాట్లాడి సూపరింటెండెంట్ వినయ్ పై చేసిన ఆరోపణలపై నిజనిర్ధారణ చేసుకున్నారు.

డి సి హెచ్ ఎస్ ఆనంద్ కూడా నర్సింగ్ సిబ్బంది చేసిన ఆరోపణలు వాస్తవమే అని ఎమ్మెల్యే దృష్టికి తీసుకు రావడంతో వినయ్ స్థానంలో కొత్తగా సీనియర్ వైద్యులు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ మూర్తిని సూపరింటెండెంట్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆదేశించారు.