రైలు కిందపడి యువతి మృతి

రైలు కిందపడి యువతి మృతి

వికారాబాద్ జిల్లా | తాండూరు

తాండూరు–మంతటి రైల్వే మార్గంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రైలు కిందపడి ఓ యువతి మృతి చెందింది. నిఫీర్ పికర్ సాబ్ దర్గా సమీపంలోని కిలోమీటర్ నంబర్ 66/53 వద్ద ఈ ఘటన జరిగినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

రైల్వే ఎస్‌ఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. యాలాల మండలం బెన్నూరు గ్రామానికి చెందిన చిలక సోని (20) కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేక ఇబ్బందులు పడుతోంది. శనివారం తండ్రి వెంకటప్పతో కలిసి బెన్నూరు నుంచి తాండూరుకు వచ్చింది.

తాండూరు బస్టాండ్ వద్ద తండ్రిని వదిలి సోని అక్కడి నుంచి వెళ్లిపోయింది. కుమార్తె కనిపించకపోవడంతో తండ్రి పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో తాండూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో ఆదివారం ఉదయం సుమారు 9 గంటల సమయంలో తాండూరు–మంతటి రైల్వే మార్గంలో యువతి మృతదేహాన్ని గుర్తించారు. గుర్తుతెలియని రైలు కిందపడి సోని మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

మృతదేహాన్ని తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.