అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించుకోండి
ప్రతి అంశానికీ రాజకీయ రంగు పులమొద్దు – పునీత్
వికారాబాద్ జిల్లా | తాండూరు
తాండూరు వినాయక్ చౌక్ వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు అంశంపై బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ నాగారం మల్లేశం చేసిన వ్యాఖ్యలపై యువజన కాంగ్రెస్ నాయకుడు పునీత్ స్పందించారు.
వినాయక చౌక్ ఉత్సవ కమిటీ నిర్ణయం మేరకు హిందూ ఉత్సవ సమితి, ఆర్డీవో, విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో తీసుకున్న నిర్ణయాలను కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులకు ఆపాదించడం సరికాదన్నారు. అధికారులతో మాట్లాడి పరిష్కరించుకోవాల్సిన అంశాన్ని సోషల్ మీడియాలో రాద్ధాంతం చేయడం సరికాదని పేర్కొన్నారు.
“నిర్ణయం నచ్చకపోతే సంబంధిత అధికారులను సంప్రదించాలి. సమస్య ఉంటే అధికారులతో చర్చించి పరిష్కరించుకోవాలి. అంతేకానీ ప్రతి అంశాన్ని సోషల్ మీడియాలో పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఎందుకు?” అని పునీత్ ప్రశ్నించారు.
వినాయక చౌక్ ఉత్సవాలు గత 46 ఏళ్లుగా ప్రజల భాగస్వామ్యంతో కొనసాగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలని, వాటికి రాజకీయ రంగు పులమడం సరికాదన్నారు. ఉత్సవ కమిటీ, అధికారులు సమన్వయంతో తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ నాయకులను బాధ్యులను చేయడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని నాగారం మల్లేశం ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
ప్రజాప్రతినిధిగా సమస్య కనిపిస్తే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని, సోషల్ మీడియా పోస్టులతో ప్రజల్లో గందరగోళం సృష్టించడం ప్రజాసేవ కాదని పునీత్ అన్నారు.
“ప్రజలకు ఉపయోగపడే పని చేయాలనుకుంటే అధికారులతో మాట్లాడండి.. సమస్య ఉంటే పరిష్కారానికి సూచనలు ఇవ్వండి.. ప్రతి విషయానికీ రాజకీయ రంగు పులిమి విమర్శలు చేయడం మాత్రం మానుకోవాలి” అని పునీత్ స్పష్టం చేశారు.
