🔴 ఈర్షెట్టిపల్లి గ్రామ పంచాయతీలో అధికారుల నిర్లక్ష్యం
వెలగని వీధిదీపాలు, వృథా అవుతున్న నీరు
నిజస్వరం తాండూరు ప్రతినిధి ::
గ్రామ పంచాయతీ పరిధిలో గత కొంతకాలంగా మౌలిక సదుపాయాల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని వీధిదీపాలు వెలగకపోవడంతో రాత్రి వేళల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చీకటి కారణంగా పాము పొంచి ఉండే ప్రమాదం ఉందని, మహిళలు, వృద్ధులు బయటకు రావాలంటే భయపడుతున్నారని గ్రామస్థులు చెబుతున్నారు.
మరోవైపు, గ్రామంలో నీటి సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. పైపులైన్ల లీకేజీల వల్ల విలువైన తాగునీరు రోడ్లపై వృథాగా పోతోంది. ఒకవైపు నీటి పొదుపుపై ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నా, ఇక్కడ మాత్రం నీరు వృథా అవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.
ఈ సమస్యల గురించి గ్రామ సర్పంచ్ మరియు సెక్రటరీకి పలుమార్లు విన్నవించినప్పటికీ, వారి నుంచి ఎటువంటి స్పందన లేదని ప్రజలు మండిపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల గ్రామంలో సమస్యలు పేరుకుపోతున్నాయని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వీధిదీపాలు వేయించాలని, నీటి వృథాను అరికట్టాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
