ఎమ్మెల్యేతో విభేదాలంటూ వస్తున్న ప్రచారంలో నిజం లేదు! కుటుంబ కార్యక్రమం వల్లే ప్రారంభోత్సవానికి దూరం రాజకీయ రంగు పులమొద్దంటూ చైర్‌పర్సన్‌ నీరజా బాల్‌రెడ్డి స్పష్టీకరణ

వికారాబాద్ జిల్లా…

ఎమ్మెల్యేతో విభేదాలంటూ వస్తున్న ప్రచారంలో నిజం లేదు!

కుటుంబ కార్యక్రమం వల్లే ప్రారంభోత్సవానికి దూరం

రాజకీయ రంగు పులమొద్దంటూ చైర్‌పర్సన్‌ నీరజా బాల్‌రెడ్డి స్పష్టీకరణ

తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి స్పష్టం చేశారు. కుటుంబంలో నవరాత్రుల సందర్భంగా దీపం పెట్టే కార్యక్రమం ఉండటంతోనే శ్రీ సద్గురు పోట్లి మహరాజ్‌ దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన నూతన వ్యాపార సముదాయాల ప్రారంభోత్సవానికి హాజరుకాలేకపోయానని వెల్లడించారు. తన గైర్హాజరును రాజకీయ విభేదాలతో ముడిపెట్టి ప్రచారం చేయడం తగదని పేర్కొన్నారు.

తాండూరు పట్టణంలోని శ్రీ సద్గురు పోట్లి మహరాజ్‌ దేవాలయ ప్రాంగణంలో గురువారం నూతన వ్యాపార సముదాయాల ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నీరజా బాల్‌రెడ్డి కార్యక్రమానికి రాకపోవడంతో రాజకీయ వర్గాల్లో పలు ఊహాగానాలు మొదలయ్యాయి.

ఈ ప్రచారంపై స్పందించిన నీరజా బాల్‌రెడ్డి.. వ్యక్తిగత, కుటుంబపరమైన కార్యక్రమాల కారణంగా కొన్ని సందర్భాల్లో హాజరుకాలేకపోవడం సహజమని తెలిపారు. అలాంటి విషయాలను రాజకీయ విభేదాలుగా చిత్రీకరించడం సరికాదన్నారు. ఎమ్మెల్యేతో తనకు ఎలాంటి మనస్పర్థలు లేవని స్పష్టం చేస్తూ, అనవసరంగా రాజకీయ చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేయవద్దని సూచించారు.

చైర్‌పర్సన్‌ గైర్హాజరుపై జరుగుతున్న ప్రచారాన్ని ఏఎంసీ మాజీ చైర్మన్‌ పట్లోళ్ల బాల్‌రెడ్డి కూడా ఖండించారు. కుటుంబంలో నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన దీపం పెట్టే కార్యక్రమం కారణంగానే నీరజా బాల్‌రెడ్డి ప్రారంభోత్సవానికి హాజరుకాలేకపోయారని వివరించారు. ఈ విషయాన్ని రాజకీయ వివాదంగా మార్చడం సమంజసం కాదని పేర్కొన్నారు.