అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకోం
ఆధారాలతో బదులిస్తాం
BRS నేతలకు కాంగ్రెస్ హెచ్చరిక
వికారాబాద్ జిల్లా తాండూర్
నియోజకవర్గంలోని యాలాల్ మండలంలో రాజకీయ విమర్శలు వేడెక్కుతున్నాయి. BRS నాయకులు చేస్తున్న అసత్య, నిరాధార ప్రచారాలను ఇకపై ఊరుకునేది లేదని యాలాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కే. మహిపాల్ హెచ్చరించారు.
BRS నేతలు తప్పుడు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే.. ప్రతి ఆరోపణకు ఆధారాలతో, వాస్తవాలతో సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న BRS నేతలు ముందుగా తమ పాలనలో ఇచ్చిన హామీలు, చేపట్టిన అభివృద్ధి పనులు, నిర్ణయాలు, ఆర్థిక వ్యవహారాలపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతు సంక్షేమం, మహిళల సంక్షేమం, గృహజ్యోతి వంటి పథకాల ద్వారా ప్రజలకు ప్రయోజనం కల్పిస్తున్నామని తెలిపారు.
రాజకీయ విమర్శలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమేనని.. అయితే అసత్య ఆరోపణలు చేస్తే మౌనంగా ఉండబోమని మహిపాల్ స్పష్టం చేశారు. ఇకపై ప్రతి తప్పుడు ప్రచారానికి ఆధారాలతో కౌంటర్ ఇస్తామని.. ప్రతి ఆరోపణకు వాస్తవాలతో సమాధానం చెబుతామని హెచ్చరించారు.
