వినాయక్ చౌక్‌లో ట్రాన్స్‌ఫార్మర్ పిల్లర్ తొలగింపు
అధికారుల స్పందనతో తొలగించిన ట్రాన్స్‌ఫార్మర్ పిల్లర్.. దుకాణదారుల హర్షం
వికారాబాద్ జిల్లా | తాండూర్
తాండూర్‌లోని వినాయక్ చౌక్‌లో నడిరోడ్డుపై ట్రాన్స్‌ఫార్మర్ పిల్లర్ దిమ్మె ఏర్పాటు అంశంపై వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు. ప్రజలు, మార్కెట్ దుకాణదారుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న అధికారులు అక్కడ ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్ పిల్లర్ దిమ్మెను తొలగించారు.
రద్దీగా ఉండే వినాయక్ చౌక్‌లో రహదారి మధ్యలో ట్రాన్స్‌ఫార్మర్ దిమ్మె ఏర్పాటు చేయడంతో ప్రజలు, వాహనదారులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందంటూ దుకాణదారులు అధికారులకు వినతిపత్రం అందజేశారు.
ట్రాన్స్‌ఫార్మర్ మార్చేందుకు ట్రాన్స్‌కో నుంచి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని అధికారులు స్పష్టం చేసిన నేపథ్యంలో, సమస్యపై స్పందించి దిమ్మెను తొలగించడం జరిగింది.
అధికారుల చర్యతో ప్రజల భద్రతకు ప్రాధాన్యత లభించిందని మార్కెట్ దుకాణదారులు హర్షం వ్యక్తం చేశారు. రద్దీ ప్రాంతాల్లో ఇలాంటి నిర్మాణాలు చేపట్టే ముందు ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ముందస్తుగా పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు.
