నడిరోడ్డుపై ట్రాన్స్‌ఫార్మర్‌.. ప్రజల భద్రతపై ప్రశ్నలు వినాయక్ చౌక్‌లో ట్రాన్స్‌ఫార్మర్ దిమ్మె ఏర్పాటుపై వ్యాపారుల అభ్యంతరం

నడిరోడ్డుపై ట్రాన్స్‌ఫార్మర్‌.. ప్రజల భద్రతపై ప్రశ్నలు

వినాయక్ చౌక్‌లో ట్రాన్స్‌ఫార్మర్ దిమ్మె ఏర్పాటుపై వ్యాపారుల అభ్యంతరం

వికారాబాద్ జిల్లా | తాండూర్

తాండూర్ పట్టణంలోని వినాయక్ చౌక్‌లో నడిరోడ్డుపై ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు జరుగుతున్న పనులు ప్రజల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి. రద్దీగా ఉండే రోడ్లో  ట్రాన్స్ఫారం ఏర్పాటు చేస్తే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో పాటు, పక్కనే ఉన్న స్కూలు విద్యార్థులకు, ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని మార్కెట్ దుకాణాల నిర్వాహకులు, యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే వినాయక్ చౌక్‌లో వాహనాలు, ప్రజల రాకపోకలతో రద్దీగా ఉంటుందని, అలాంటి ప్రాంతంలో రోడ్డుకు మధ్యలో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్ సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు, ఫైర్‌ ఇంజిన్లు వంటి వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని తెలిపారు.

ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ప్రమాదం జరిగితే ప్రజల ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? అంటూ దుకాణదారులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా, రహదారి భద్రతకు ఆటంకం లేకుండా ప్రత్యామ్నాయ ప్రదేశాన్ని ఎంపిక చేసి ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

ఈ మేరకు తక్షణమే పనులు నిలిపివేయాలని కోరుతూ ట్రాన్స్‌కో ఏఈతో పాటు మున్సిపల్ కమిషనర్‌కు మార్కెట్ దుకాణాల నిర్వాహకులు, యజమానులు వినతిపత్రం సమర్పించారు.

అనుమతులపైనా స్పష్టత కోరుతున్న ప్రజలు

మరోవైపు ట్రాన్స్‌ఫార్మర్ మార్చేందుకు ట్రాన్స్‌కో నుంచి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని ఏఈ స్పష్టం చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో అసలు అనుమతులు లేకుండానే పనులు ఎవరి ఆధ్వర్యంలో జరుగుతున్నాయనే అంశంపై కూడా స్పష్టత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.

ప్రజల భద్రతకు సంబంధించిన అంశం కావడంతో అధికారులు వెంటనే స్పందించి, స్థలాన్ని పరిశీలించి, రహదారి రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిర్ణయం తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.