వికారాబాద్ జిల్లా | పెద్దేముల్
పెట్రోల్‌లో నీళ్లు.. గ్రామసభలో రైతు ఫిర్యాదు
అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సర్పంచ్ డివై నర్సింలు – బంకును పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ
పెద్దేముల్ మండల కేంద్రంలోని విఘ్నేశ్వర ఫిల్లింగ్ స్టేషన్‌లో పెట్రోల్‌కు బదులుగా నీళ్లు వస్తున్నాయంటూ పెద్దేముల్ గ్రామానికి చెందిన రైతు ఖాజా మియా శుక్రవారం గ్రామసభలో ఫిర్యాదు చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న గ్రామసభకు ఆయన నేరుగా చేరుకుని, నీళ్లు కలిసినట్లు కనిపిస్తున్న పెట్రోల్‌తో కూడిన బాటిల్‌ను సర్పంచ్ డివై నర్సింలుకు చూపించి తన గోడును వివరించారు.

రైతు ఖాజా మియా తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం ఉదయం తన ద్విచక్ర వాహనం మరియు పొలంలో మందు పిచికారీ చేసే యంత్రం కోసం పెట్రోల్ నింపించుకున్నారు. అయితే బాటిల్‌లో ఉన్నది పెట్రోల్ కాకుండా నీళ్ల మాదిరిగా కనిపించడంతో అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని బంకు సిబ్బందిని ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వకుండా, తన చేతిలో ఉన్న బాటిల్‌ను బలవంతంగా లాక్కొని దాచిపెట్టారని ఆరోపించారు.
దీంతో మరింత అనుమానం వచ్చిన రైతు తన బైక్ ట్యాంక్‌లోని పెట్రోల్‌ను మరో బాటిల్‌లోకి వంపి పరిశీలించగా, అందులోనూ నీళ్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించానని తెలిపారు. అనంతరం ఆ బాటిల్‌ను తీసుకుని గ్రామసభకు వచ్చి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రైతులను, వినియోగదారులను ఈ విధంగా మోసం చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతు ఫిర్యాదుపై సర్పంచ్ డివై నర్సింలు వెంటనే స్పందించి సంబంధిత ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఘటనపై విచారణ చేపట్టి, పెట్రోల్ బంకును స్వయంగా పరిశీలించి వాస్తవాలను నిర్ధారిస్తామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకునేలా చూస్తామని గ్రామ పంచాయతీ పాలకవర్గం రైతుకు హామీ ఇచ్చింది. దీంతో రైతు ఖాజా మియా తన ఆందోళనను విరమించారు
