తండ్రిని హతమార్చిన కుమారుడు.

🔴 తండ్రిని హతమార్చిన కుమారుడు.

నిందితుడి అరెస్ట్, రిమాండ్.

నిజస్వరం తాండూర్ ప్రతినిధి ::

వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం లోని పెద్దేముల్ మండలం బాయిమీది తండాలో చోటుచేసుకున్న ఘోర హత్య కేసు వివరాలను వెల్లడించిన తాండూరు రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్.

కుటుంబ కలహాల నేపథ్యంలో కుమారుడే తండ్రిని గొడ్డలితో నరికి చంపినట్లు పోలీసుల ధ్రువీకరణ.

బాయిమీది తండాకు చెందిన రాథోడ్ లోక్య నాయక్ (మృతుడు), బిక్కి బాయి దంపతులకు ముగ్గురు సంతానం.

లోక్య నాయక్ మద్యానికి బానిసై తరచుగా తన భార్యను, చిన్న కుమార్తెను వేధించేవాడు. ఈ క్రమంలో, మార్చి 27వ తేదీ ఉదయం లోక్య నాయక్ తన భార్యను,ఇంట్లోనే ఉంటున్న చిన్న కుమార్తెను తీవ్రంగా కొట్టడంతో

బాధితురాలు బిక్కి బాయి వెంటనే హైదరాబాద్‌లో ఆటో నడుపుకుంటూ జీవిస్తున్న తన కుమారుడు రాథోడ్ సునీల్ నాయక్ (34) కు ఫోన్ ద్వారా సమాచారం అందించింది.

స్వగ్రామానికి చేరుకున్న సునీల్ నాయక్, తన తల్లి,చెల్లెలిని వేధిస్తున్న విషయంలో తండ్రితో వాగ్వాదానికి దిగాడు.

మాట మాట పెరగడంతో ఆవేశానికి లోనైన సునీల్ నాయక్, ఇంట్లో ఉన్న గొడ్డలితో తండ్రి మెడ, దవడ, తల వెనుక భాగంలో బలంగా కొట్టాడు. దీనితో లోక్య నాయక్ రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే మృతి చెందాడు.

సమాచారం అందుకున్న పెద్దేముల్ ఎస్సై,తాండూరు రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

నిందితుడు రాథోడ్ సునీల్ నాయక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని,

మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు.