భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం.

🔴 తాండూరులో భక్తిశ్రద్ధలతో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం.

నిజస్వరం తాండూర్ ప్రతినిధి ::

హనుమాన్ జయంతి వేడుకలను పురస్కరించుకొని తాండూరు పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పట్టణంలోని ఇందిరా నగర్ లో గల శ్రీ రామ మందిరంలో గురువారం నిర్వహించిన సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమం కన్నుల పండువగా సాగింది.

శ్రీరామ భక్త హనుమాన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సామూహిక పారాయణంలో భక్తులు ఏకధాటిగా హనుమాన్ చాలీసాను పఠించడంతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.

ఈ కార్యక్రమంలో పట్టణంలోని పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. హిందూ వాహిని, బజరంగ్ దళ్ కార్యకర్తలు మరియు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. సమాజ క్షేమం కోసం, యువతలో భక్తి భావాన్ని పెంపొందించేందుకు ఇటువంటి సామూహిక పారాయణాలు దోహదపడతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. పట్టణంలోని వివిధ కాలనీల నుండి భక్తులు తరలి రావడంతో ఇందిరా నగర్ ప్రాంతం భక్తులతో కిక్కిరిసిపోయింది.