వికారాబాద్ జిల్లా తాండూర్..
-
సంకల్ప్’ పేరుతో ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తున్నారని ఏబీవీపీ ఆరోపణలు.. చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి
తాండూర్, జూలై 19:
ఆదివారం సెలవు రోజున కూడా పరీక్షల పేరుతో భాష్యం కళాశాలలో తరగతులు నిర్వహించడం విద్యార్థులపై మానసిక ఒత్తిడికి దారితీస్తోందని ఏబీవీపీ నగర అధ్యక్షుడు నరసింహులు ఆరోపించారు.
ఆదివారం నిర్వహించిన నిరసన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వారంలో ఒక్కరోజు వచ్చే సెలవు రోజున కూడా “సంకల్ప్” పేరుతో ప్రత్యేక తరగతులు నిర్వహించడం విద్యార్థుల విశ్రాంతికి భంగం కలిగిస్తోందన్నారు. ఈ ప్రత్యేక తరగతులకు ప్రభుత్వ అనుమతులు లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా కళాశాల నిర్వహణ కొనసాగుతోందని ఆరోపించారు.
భాష్యం కళాశాల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ వ్యవహరిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి కళాశాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు.
అలాగే కళాశాల కరస్పాండెంట్ ఏబీవీపీ నాయకులను దుర్భాషలాడుతూ వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకున్నారని, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘం నాయకులతో వాగ్వాదానికి దిగడం సరైన విధానం కాదన్నారు. ఇలాంటి చర్యలను ఏబీవీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని, ప్రజల ముందు ఎండగడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అజయ్, నాయకులు నవీన్ గౌడ్, జాఫర్, భరత్, కార్తీక్, కౌతిఫ్ తదితరులు పాల్గొన్నారు
