తాండూర్ లోనే జిల్లా ఆసుపత్రి కొనసాగించాలి 36వ వార్డు కౌన్సిలర్ రూపా రుద్రూ పాటిల్

వికారాబాద్ జిల్లా…

తాండూర్ లోనే జిల్లా ఆసుపత్రి కొనసాగించాలి

ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతిపత్రం అందజేసిన 36వ వార్డు కౌన్సిలర్ రూపా రుద్ర పాటిల్

తాండూర్, జూలై 18:

వికారాబాద్ జిల్లా తాండూరులో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాండూర్ నుంచే తరలించకుండా యథావిధిగా కొనసాగించాలని కోరుతూ తాండూర్ మున్సిపాలిటీ 36వ వార్డు కౌన్సిలర్ రూపా రుద్ర పాటిల్ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతిపత్రం అందజేశారు.

తాండూర్ పర్యటనకు వచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించిన రూపా రుద్ర పాటిల్, తాండూర్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి వికారాబాద్ జిల్లా ప్రజలకు, ముఖ్యంగా తాండూర్ నియోజకవర్గ ప్రజలకు ఎన్నో సంవత్సరాలుగా కీలక వైద్య సేవలు అందిస్తోందని వివరించారు. ఆసుపత్రిని ఇతర ప్రాంతానికి తరలిస్తే వేలాది మంది పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా వినతిపత్రాన్ని స్వీకరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి ఎక్కడికీ వెళ్లదని, తాండూరులోనే కొనసాగుతుందని హామీ ఇచ్చినట్లు రూపా రుద్ర పాటిల్ తెలిపారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నట్లు ఆమె వెల్లడించారు.

మంత్రి ఇచ్చిన హామీతో తాండూర్ ప్రజలు, ప్రజాప్రతినిధులు, సామాజిక వర్గాల ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి తాండూరులోనే కొనసాగుతుందనే హామీతో స్థానికుల్లో నెలకొన్న ఆందోళనకు కొంత మేర ఉపశమనం లభించినట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.