వర్షాలు కురవాలని మైనారిటీ సోదరుల ప్రత్యేక ప్రార్థనలు

వికారాబాద్ జిల్లా, తాండూరు:

వర్షాలు కురవాలని మైనారిటీ సోదరుల ప్రత్యేక ప్రార్థనలు

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని చెంగేష్ పూర్ రోడ్డు మార్గంలో ఉన్న ఈద్గాలో మైనారిటీ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులు పంటలతో సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో జీవించాలని అల్లాహ్‌ను ప్రార్థించారు.

ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ, నీరు జీవనాధారానికి అత్యంత ముఖ్యమైనదని, వర్షాభావం కారణంగా పంట పొలాలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. తాండూరు పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోయాయని, బోర్లలో కూడా నీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలపై దయ చూపి సమృద్ధిగా వర్షాలు కురిపించి చెరువులు, కుంటలు, బావులు నిండేలా చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని అల్లాహ్‌ను వేడుకున్నారు.

అలాగే దేశంలో శాంతి, సామరస్యం నెలకొనాలని, ప్రజల మధ్య సోదరభావం, ఐకమత్యం మరింత బలపడాలని ప్రత్యేకంగా ప్రార్థించారు. 

ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణానికి చెందిన మైనారిటీ సోదరులు, మత పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.