వికారాబాద్ జిల్లా | తాండూరు
నిరుద్యోగ యువతకు బీఎంఆర్ ఫౌండేషన్ అండ..
పోలీస్ ఉద్యోగాల సాధనకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణ
నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలోని బీఎంఆర్ ఫౌండేషన్ ముందడుగు వేసింది. ఎస్ఐ, కానిస్టేబుల్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న సుమారు 250 మంది అభ్యర్థులకు ఉచిత స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేసింది. ఆర్థిక పరిస్థితులు విద్యార్థుల భవిష్యత్తుకు అడ్డంకి కాకూడదని, పట్టుదలతో చదివి పోలీస్ ఉద్యోగాలు సాధించాలని ఎమ్మెల్యే అభ్యర్థులకు పిలుపునిచ్చారు.
తాండూరు పట్టణంలోని విలియం మూన్ స్కూల్లో బీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహ మెహ్రాతో కలిసి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉచిత కోచింగ్‌తో పాటు స్టడీ మెటీరియల్ అందించడం అభినందనీయమన్నారు. 2018లో పరిగిలో నిరుద్యోగ యువత కోసం కోచింగ్ కార్యక్రమం నిర్వహించడంతో పాటు, 2022లో సుమారు 60 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు గైడ్స్ పంపిణీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. విద్యార్థులు, పేద కుటుంబాలకు బీఎంఆర్ ఫౌండేషన్ అందిస్తున్న సేవలను ప్రశంసించారు. అభ్యర్థులంతా కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ..
నవంబర్ 29న ఎస్ఐ, డిసెంబర్ 20న కానిస్టేబుల్ పరీక్షలు ఉన్నాయని, అప్పటివరకు అభ్యర్థుల దృష్టి పూర్తిగా ఉద్యోగ సాధనపైనే ఉండాలని సూచించారు. అర్జునుడికి పక్షి కన్ను కనిపించినట్లు.. అభ్యర్థులకు తమ లక్ష్యం మాత్రమే కనిపించాలని పిలుపునిచ్చారు.
ఉచిత కోచింగ్ అని నిర్లక్ష్యం చేయకుండా, ఫీజు చెల్లించి చదువుతున్నామనే పట్టుదలతో శిక్షణ పొందాలని సూచించారు. ఆర్థిక పరిస్థితులు భవిష్యత్తును నిర్ణయించకూడదని, కృషి, పట్టుదలే విజయానికి మార్గమని పేర్కొన్నారు.
ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నామని, ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టం చేశారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, రీల్స్‌కు దూరంగా ఉంటూ చదువుపైనే దృష్టి పెట్టాలని సూచించారు. ఇప్పటికే వీక్లీ గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తున్నామని, మాక్ టెస్టుల్లో తక్కువ మార్కులు వచ్చినా నిరాశ చెందకుండా తప్పులను సరిదిద్దుకోవాలని తెలిపారు.
ప్రాథమిక పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ టెస్టుల శిక్షణతో పాటు తుది పరీక్షకు కూడా కోచింగ్ అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
2018లో పరిగిలో సుమారు 1,500 మంది అభ్యర్థులతో కోచింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, ఆ శిక్షణ ద్వారా పలువురు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భవిష్యత్తులో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు తమలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు.
నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తూ, ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు అవసరమైన శిక్షణ, స్టడీ మెటీరియల్ అందించడమే లక్ష్యంగా బీఎంఆర్ ఫౌండేషన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పోలీస్ కొలువులు సాధించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
