వాల్మీకి జయంతి వేడుకల్లో పాల్గొన్న తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్రెడ్డి బోయ సమాజానికి కమ్యూనిటీ భవనం నిర్మాణానికి కృషి చేస్తాం

వికారాబాద్ జిల్లా..

వాల్మీకి జయంతి వేడుకల్లో పాల్గొన్న తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్రెడ్డి

బోయ సమాజానికి కమ్యూనిటీ భవనం నిర్మాణానికి కృషి చేస్తాం

తాండూరు: మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు తాండూరులో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సీనన్న, సాయిపుత్ర హోమ్స్ అధినేత శంకర్ యాదవ్ తండ్రి హనుమయ్య, వాల్మీకి ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వాల్మీకి నగర్ లోని మహర్షి వాల్మీకి ఆలయానికి వెళ్లి నివాళులర్పించి, ఆయన ఆశయాలను స్మరించుకున్నారు. మహర్షి వాల్మీకి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని, ఆయన రచించిన రామాయణ మహాకావ్యం సమాజానికి ధర్మం, నైతిక విలువలను బోధిస్తుందని మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్రెడ్డి పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

బోయ సమాజానికి కమ్యూనిటీ భవనం నిర్మాణానికి కృషి

వాల్మీకి బోయ సమాజానికి చెందిన కుటుంబాలు ఎన్నో సంవత్సరాలుగా తమ సమాజ అభివృద్ధి కోసం కమ్యూనిటీ భవనం నిర్మించాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ విషయమై ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డికి పలుమార్లు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. కమ్యూనిటీ భవనం నిర్మాణం జరిగితే సమాజంలోని కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.

కొన్ని అనివార్య కారణాల వల్ల ఎమ్మెల్యే ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయినప్పటికీ, వాల్మీకి బోయ సమాజానికి అవసరమైన స్థలాన్ని గుర్తించి, కమ్యూనిటీ భవనం నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు.

బోయ సమాజంలోని కుటుంబాలన్నీ ఐక్యంగా ఉండి, కమ్యూనిటీ భవనం నిర్మాణం సాకారం అయ్యేలా కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. వాల్మీకి జయంతి వేడుకలను విజయవంతంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులకు, నిర్వాహకులకు, కార్యక్రమానికి హాజరైన భక్తులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.