వికారాబాద్ జిల్లా….
-
విశ్వవేదా హైస్కూల్లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
వికారాబాద్ జిల్లా, తాండూరు: తాండూరు పట్టణంలోని విశ్వవేదా హైస్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాలఆవరణలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి వేడుకలను ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా చిన్నారులు శ్రీకృష్ణుడు, రాధ, గోపికలతో పాటు వివిధ దేవతలు, పురాణ పాత్రల వేషధారణలో ముస్తాబై అందరినీ ఆకట్టుకున్నారు. చిన్నారుల అందమైన వేషధారణలు, చిలిపి చేష్టలు, కృష్ణుడి లీలలను ప్రతిబింబించే ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

విద్యార్థులు ఆటపాటలు, భజనలు, నృత్యాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించి సందడి చేశారు. శ్రీకృష్ణుడి బాల్య ఘట్టాలను ప్రతిబింబించేలా చిన్నారులు చేసిన ప్రదర్శనలు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
అనంతరం విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధ, గోపికల వేషధారణలో తాండూరు పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు నృత్యాలు చేస్తూ, సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తూ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారుల సందడి, కృష్ణ నామస్మరణతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల విశిష్టతను చిన్నారులకు తెలియజేయడమే ఇటువంటి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, ఐక్యతా భావాన్ని పెంపొందించేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో కరస్పాండెంట్ జి. గణేష్ కుమార్, ప్రిన్సిపాల్ జి. వెంకటేష్, డైరెక్టర్ పి. సుజాత, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. వేడుకలను విజయవంతం చేసిన విద్యార్థులు, ఉపాధ్యాయులను పాఠశాల యాజమాన్యం అభినందించింది.
