తాండూరుకు హంగామా రాజకీయాలు వద్దు అభివృద్ధి రాజకీయాలే కావాలి.

🔴 తాండూరుకు హంగామా రాజకీయాలు వద్దు అభివృద్ధి రాజకీయాలే కావాలి.

బీఆర్ఎస్ ర్యాలీలో అసభ్య నినాదాలు ప్రజాస్వామ్యానికి మచ్చ రోహిత్ రెడ్డి నైతిక బాధ్యత వహించి క్షమాపణ చెప్పాలి

నిజస్వరం తాండూర్ ప్రతినిధి ::

తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి రాక సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు, కొందరు యువజన నాయకులు ప్రదర్శించిన తీరు తాండూరు ప్రజలను తీవ్ర అసహ్యానికి గురిచేసింది. ర్యాలీలో వినిపించిన అసభ్య పదజాలం, రెచ్చగొట్టే నినాదాలు, రాజకీయ ప్రత్యర్థులను వ్యక్తిగతంగా కించపరిచే వ్యాఖ్యలు ప్రజాస్వామ్య సంస్కృతిని అవమానించే చర్యలు.

ప్రస్తుత ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పై, ఆయన కుటుంబ సభ్యులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయ విమర్శల పరిధిని దాటి వ్యక్తిత్వ హననానికి దిగజారిన తీరు. యువతకు దిశానిర్దేశం చేయాల్సిన నాయకులు ఇలాంటి సంస్కృతిని ప్రోత్సహించడం అత్యంత బాధాకరం.

రోహిత్ రెడ్డి మౌనం ఎందుకు

ఇంత పెద్ద ర్యాలీలో ఇలాంటి వ్యాఖ్యలు వినిపించినప్పుడు మాజీ ఎమ్మెల్యే శ్రీ పైలట్ రోహిత్ రెడ్డి వాటిని వెంటనే ఖండించకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది. ఈ సంఘటనపై ఆయన నైతిక బాధ్యత వహించి తాండూరు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ముఖ్యంగా యువజన నాయకుడు అనిల్ బాండ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను స్పష్టంగా ఖండించాలి.

దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రండి

మేము బహిరంగంగా సవాల్ విసురుతున్నాం.

– బీఆర్ఎస్ పాలనలో మొదటి మూడు సంవత్సరాల్లో తాండూరుకు వచ్చిన నిధులు ఎంత?

జరిగిన అభివృద్ధి పనులు ఏమిటి?

-కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నాయకత్వంలో వచ్చిన నిధులు, జరుగుతున్న అభివృద్ధి ఎంత?

ప్రజల సమక్షంలో ఆధారాలతో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దమ్ముంటే బీఆర్ఎస్ నాయకులు కూడా ముందుకు రావాలి.

తాండూరు ప్రజల తీర్పు స్పష్టం

తాండూరు ప్రజలు తొడగొట్టే రాజకీయాలు, మీసాలు తిప్పే రాజకీయాలు, బలప్రదర్శన రాజకీయాలు కోరుకోవడం లేదు. ప్రజలు కోరుకుంటున్నది అభివృద్ధి, ఉపాధి, విద్య, తాగునీరు, రోడ్లు, సంక్షేమం వంటి ప్రజా సమస్యల పరిష్కారం.

హంగామా చేసే నాయకులు ఎవరో, అభివృద్ధిని ఎజెండాగా తీసుకుని ముందుకు సాగుతున్న నాయకులు ఎవరో తాండూరు ప్రజలకు బాగా తెలుసు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారు. తగిన సమయంలో ప్రజాస్వామ్యబద్ధంగా తమ తీర్పును ఇస్తారు. అని కె. గోపాల్ న్యాయవాది అధికార ప్రతినిధి వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) తెలియజేశారు.