తాండూర్‌లో బీఆర్ఎస్ SIR సమీక్ష.. 71 శాతం డిజిటలైజేషన్ పూర్తి

వికారాబాద్ జిల్లా | తాండూర్

తాండూర్‌లో బీఆర్ఎస్ SIR సమీక్ష.. 71 శాతం డిజిటలైజేషన్ పూర్తి

తాండూర్, ఆగస్టు 4: నిజ స్వరం ప్రతినిధి:-

తాండూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం శ్రీశైల్ రెడ్డి పంజుగుల అధ్యక్షతన SIR (ప్రత్యేక ఓటరు జాబితా సవరణ) ప్రక్రియపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీశైల్ రెడ్డి మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పిలుపు మేరకు ఈ సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ బీఎల్‌ఏలు ఉత్సాహంగా పనిచేస్తున్నారని, ఆర్డీవో లెక్కల ప్రకారం తాండూర్ నియోజకవర్గంలో ఇప్పటికే 71 శాతం డిజిటలైజేషన్ పూర్తైందని చెప్పారు. మిగిలిన ప్రక్రియను కూడా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

తాండూర్ పట్టణంలో బోగస్ ఓట్లు, డబుల్ ఓట్లు, మృతుల పేర్లపై ఉన్న ఓట్లు, ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్ల వివరాల పరిశీలన ఎక్కువగా ఉండటంతో ప్రక్రియ కొంత ఆలస్యమవుతోందన్నారు. మిగిలిన ఆరు రోజుల గడువును సద్వినియోగం చేసుకొని ప్రతి గ్రామంలో నాయకులు, కార్యకర్తలు మరింత చురుగ్గా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ప్రజాస్వామ్య వ్యవస్థపై విశ్వాసంతోనే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. పార్టీ అధిష్టానం, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు SIR ప్రక్రియలో పాల్గొంటున్నామని, తెలంగాణ వ్యాప్తంగా ఈ ప్రక్రియ పకడ్బందీగా జరగాలన్న కేసీఆర్ ఆలోచన మేరకు పనిచేస్తున్నామని తెలిపారు.

ఇప్పటికీ ఎన్యుమరేషన్ ఫారాలు తిరిగి సమర్పించని వారు వెంటనే అందజేయాలని ప్రజలను కోరారు. ఇతర ప్రాంతాల్లో ఓటు ఉన్నవారు అక్కడి ఓటును రద్దు చేయించి తాండూర్‌లోనే ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు, కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు, బీఎల్‌ఏలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.