మూడు మండలాల్లో ఎన్యూమరేషన్ పురోగతిపై శ్రీశైల్ రెడ్డి సమీక్ష
తాండూర్, జూలై 16 : నిజస్వరం ప్రతినిధి:-
తాండూర్ నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియపై బీఆర్ఎస్ తాండూర్ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీశైల్ రెడ్డి పంజుగుల గురువారం రోజంతా క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటన నిర్వహించారు. బషీరాబాద్, యాలాల్, తాండూర్ మండలాల్లోని గ్రామ పంచాయతీ కార్యాలయాలను సందర్శిస్తూ BLOలు, BLAలు, గ్రామ ప్రజలతో నేరుగా మాట్లాడి ఎన్యూమరేషన్ పనుల పురోగతిని పరిశీలించారు. గ్రామాల వారీగా ఫారాల పంపిణీ, సేకరణ, ప్రజల స్పందన, ఎదురవుతున్న సమస్యలపై సమగ్రంగా ఆరా తీశారు.
*బషీరాబాద్ మండలం*
బషీరాబాద్ మండలంలోని గంగువార్, క్యాద్గిరా, ఇందర్‌చేడ్, బషీరాబాద్ పట్టణం, మల్కన్‌గిరి, రెడ్డిఘనపూర్ గ్రామాల్లో పర్యటించిన శ్రీశైల్ రెడ్డి, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో కొనసాగుతున్న ఎన్యూమరేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఇప్పటివరకు ఎన్ని ఫారాలు పంపిణీ చేశారో, ఎన్ని దరఖాస్తులు తిరిగి స్వీకరించారో, ఇంకా ఎంత మేర పని మిగిలి ఉందో BLOలు, BLAలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తుల స్వీకరణ, నమోదు ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతోందని BLOలు వివరించారు.
*యాలాల్ మండలం..*
యాలాల్ మండలంలోని ఎన్‌కే పల్లి, పెర్కంపల్లి, యాలాల్ మండల కేంద్రంలో పర్యటించిన శ్రీశైల్ రెడ్డి, ఎన్యూమరేషన్ పనుల వేగం, ఫారాల పంపిణీ, సేకరణ, ప్రజల సహకారం, BLOలు–BLAల సమన్వయంపై సమీక్ష నిర్వహించారు. ప్రతి అర్హ ఓటరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా ఇంటింటికీ చేరుకుని అవగాహన కల్పించాలని సూచించారు. BLOలు స్పందిస్తూ, ప్రజల నుంచి మంచి సహకారం లభిస్తోందని, BLAల సమన్వయంతో నిర్ణీత గడువులోగా ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
*తాండూర్ మండలం..*
తాండూర్ మండలంలోని అంతారాం (బి), ఐనెల్లి, కోటబాస్పల్లి, మల్కాపూర్ గ్రామాల్లో పర్యటించిన శ్రీశైల్ రెడ్డి, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న ఎన్యూమరేషన్ పనులను పరిశీలించారు. ఫారాల పంపిణీ, తిరిగి స్వీకరణ, పెండింగ్ దరఖాస్తులు, పనుల శాతం, BLOలు–BLAల సమన్వయం, ప్రజల స్పందన తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. BLOలు స్పందిస్తూ, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రక్రియ కొనసాగుతోందని, ప్రజలు కూడా చురుకుగా సహకరిస్తున్నారని వివరించారు.
ఈ సందర్భంగా శ్రీశైల్ రెడ్డి మాట్లాడుతూ,
ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు. అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి మిస్ కాకుండా BLOలు, BLAలు పూర్తి సమన్వయంతో పనిచేయాలి. ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పిస్తూ ప్రతి ఇంటికి చేరుకోవాలి. ఎన్నికల కమిషన్ నిబంధనలను తూచా తప్పకుండా అమలు చేస్తూ పారదర్శకంగా ఎన్యూమరేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. ప్రజలకు అవసరమైన సహాయం అందించడం అందరి బాధ్యత అని సూచించారు.
పర్యటన సందర్భంగా గ్రామ ప్రజలు శ్రీశైల్ రెడ్డికి ఆత్మీయ స్వాగతం పలికారు. స్థానిక సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా, ప్రతి అంశాన్ని ఓపికగా ఆలకించిన శ్రీశైల్ రెడ్డి, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ పర్యటనలో ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, BLAలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
